ఆపరేషన్‌ లేకుండానే కవాటాల మార్పిడి

ప్రజాశక్తి-ఒంగోలు : ఒంగోలు కిమ్స్‌ హాసిటల్‌లో కార్డియాలజీ విభాగంలో టిఎవిఐ (ట్రాన్స్కాథెటర్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ రీప్లేసెంట్‌) అను అత్యాధునికమైన చికిత్సను గురువారం నిర్వహించారు. ఆపరేషన్‌ లేకుండానే మూసుకు పోయిన గుండెలోని కవాటాలను ఈ చికిత్స ద్వారా మార్పిడి చేసి అరుదైన ఘనతను సాధించారు. మనదేశంలో ఈ చికిత్స చేసే అతి తక్కువ ఆసుపత్రుల జాబితాలో ఒంగోలు కిమ్స్‌ హాస్పిటల్‌ చేరింది. 76 ఏళ్ల వృద్ధుడికి పరీక్షలు చేసి అతనికి గుండెలో అయోర్టిక్‌ వాల్‌ అనే కవాటం పూర్తిగా దెబ్బతిందని వైద్యులు గుర్తించారు. ఇతనికి ఇంతకు ముందే బైపాస్‌ ఆపరేషన్‌ జరిగి.. ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండటం వలన ఓపెన్‌ హార్ట్‌సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చటం పేషెంట్‌ ప్రాణానికి చాలా ప్రమాదం అని గుర్తించిన డాక్టర్‌ కపిల్‌ కార్తికేయరెడ్డి టిఎవిఐ అనే చికిత్స చేశారు. పేషెంట్‌కి చిన్న సమస్య కూడా రాకుండా అత్యంత జాగ్రత్తతో ఈ చికిత్స చేయడం వల్ల, చేసిన రెండో రోజే పేషెంట్‌ పుర్తిగా కోలుకున్నారు.దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే మూడోవంతు ఖర్చుతోనే ఈ ప్రక్రియను కిమ్స్‌ హాస్పిటల్‌లో పూర్తి చేశారు. ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినందుకు డాక్టర్‌ కపిల్‌ కార్తికేయరెడ్డిని హాస్పిటల్‌ యాజమాన్యం మరియు ఇతర వైద్యసిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కపిల్‌ కార్తికేయరెడ్డి మాట్లాడుతూ దేశంలో టిఎవిఐ చికిత్స చేయగల అతి తక్కువ ఆసుపత్రుల జాబితాలో కిమ్స్‌ హాస్పిటల్‌ చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పేషెంట్‌ అతి తక్కువ సమయంలోనే పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్స్‌ హాస్పిటల్‌ ఎగ్జికూటివ్‌ డైరెక్టర్‌ టి. గిరి నాయుడు మాట్లాడుతూ మెట్రో నగరాలతో పోటీ పడుతూ వైద్యసేవలో ఒంగోలు కిమ్స్‌ హాస్పిటల్‌ ముందడుగు వేసిందని తెలిపారు. ఈసమావేశంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కె.అంకిరెడ్డి, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు.

➡️