స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలి : కలెక్టర్

Mar 18,2025 17:33 #collector

ప్రజాశక్తి – కలక్టరేట్ ( కృష్ణా) : స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
మంగళవారం నగరంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా స్వచ్చీకరణ, క్లేయిములు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పు వంటి అంశాలపై తగిన సలహాలు, సూచనలు తీసుకొని అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఆమేరకు ఇకపై ప్రతి నెల గుర్తింపు పొందిన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకొని ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుగ్గా ఉండి వారి దృష్టికి వచ్చిన ఎన్నికల అంశాలు ఏమైనా ఉంటే వాటిని సమావేశంలో తెలియజేయాలన్నారు.ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిదిద్దడం వలన స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందని తద్వారా రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా పై విశ్వాసం కలుగుతుందన్నారు.
ఎన్నికల సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, మరుగుదొడ్లు తదితర కనీస సదుపాయాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుగానే కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో అవసరమైన మరమతులు చేపట్టి కావలసిన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఎక్కడైనా బూత్ స్థాయి అధికారుల ఖాళీలు ఉంటే వాటన్నింటిని కూడా భర్తీ చేస్తామని, ప్రతి బిఎల్ఓ కు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను రాజకీయ పార్టీల తరఫున తప్పనిసరిగా నియమించి ఆ జాబితాను అందజేయాలన్నారు. జాబితా సరిగా ఉందో లేదో ఎప్పుడైనా సరే తనిఖీ చేసేందుకు వీఎల్వోలు బిఎల్ ఏ లు ఇరువురు కలిసి పరిశీలించవచ్చన్నారు.కొత్తగా ఇల్లు గాని ఇళ్ల సముదాయాలు గాని ఏర్పడినప్పుడు ఎటువంటి జాప్యం లేకుండా అక్కడి ఓటర్లను సమీపంలోని పోలింగ్ కేంద్రంలో సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడం వలన వారికోసం కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు.చివరి నిమిషంలో ఒత్తిడి లేకుండా, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కు పొందవచ్చని, ఇందుకోసం వారు ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలో ఒక వీధిలో ఉండే ఇంటి నంబర్ల ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలాగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఓకే వీధిలోని ఇంటి నెంబర్ల ఓటర్లు వేరు వేరు కూలింగ్ కేంద్రాల్లో ఉండడం వలన పోలింగ్ శాతం తగ్గడానికి కారణం అవుతుందన్నారు. కలెక్టరేట్ చుట్టూ ఉన్న ఇంటి నెంబర్ల ఓటర్ల పేర్లు వేరువేరు పోలింగ్ కేంద్రాల్లో ఉండడంతో ఆ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం తగ్గిందన్నారు.
సిపిఎం ప్రతినిధి కొడాలి శర్మ మాట్లాడుతూ గోసంఘం ఇళ్ల సముదాయం-టిడ్ కో ఇళ్లలో 854 కుటుంబాలు ఉన్నాయని దాదాపు 2500 ఓట్లు ఉన్నందున వారికి ప్రత్యేకంగా 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రుద్రవరంలో కూడా 1400 జి ప్లస్ త్రీ ఇల్లు ఉన్నాయని వారికి కూడా కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. చిన్నకరగ్రహారం లో ఇళ్ళ సముదాయానికి కూడా కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలోఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలో రాకపోకలకు వేరువేరుగా 2 ద్వారాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ విషయమై జిల్లా ఎన్నికల అధికారి వెంటనే స్పందిస్తూ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, సిపిఐఎం, బిజెపి, బిఎస్పి,తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, జనసేన పార్టీల ప్రతినిధులు కొడాలి శర్మ , పి వి గజేంద్ర రావు, ఎస్ బాలాజీ, బి ఎం బి దాస్-దిలీప్ కుమార్, షేక్ సిలార్ దాదా, వెంకట్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు శ్యామ్ నారాయణ పాల్గొన్నారు.

➡️