ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న వ్యకాసం నాయకులు
జిఒ 73ను అమలు చేయాలని వినతి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : వ్యవసాయ కార్మికుల కోసం గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒ నెంబర్ 73ను అమలు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు డిమాండ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని తహశీల్దార్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రబీసాగు వరినాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ సమయంలో వ్యవసాయ కార్మికులకు సరైన కూలీలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు సరైన కూలి అందేవిధంగా గతంలో తీసుకొచ్చిన 73వ జిఒను అమలు చేసే దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ జిఒ ద్వారా ప్రతి వ్యవసాయ కార్మికుడు ఆరుగంటలు పనిచేస్తే రూ.500 ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం జిల్లాలో స్థానికేతర కూలీలు ఎక్కువగా వరినాట్లు వేస్తున్నారని తద్వారా స్థానిక కూలీలకు పని లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించి స్థానికులకు పని కల్పించి మిగిలిన పని దినాలను స్థానికేతరులకు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. అలాగే రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తంబి రమణయ్య, వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి తాటిపోయిన మస్తానయ్య, వ్యవసాయ అధ్యక్షులు, సిపిఎం నాయకులు గండవరపు శ్రీనివాసులు, రఘురామయ్య, పోతంశెట్టి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.