సిపిఎం ప్రజాచైతన్య యాత్రలో సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 30 ప్రకారం పట్టణా ల్లో నివాసం ఉంటున్న ఇళ్లకు 2 సెంట్లు ఉచితంగా రెగ్యులర్ చేసి ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా మంగళవారం 29 వ డివిజన్ రామకృష్ణానగర్, దాసన్నపేటల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ పేదలకు తెచ్చిన జీవోను పెద్దలు ఉపయోగించు కోకుండా చూడాలని ఆయన కోరారు. పేదలు నివసించే ప్రాంతాల్లో పక్కాగా రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని కోరారు. గతంలో 116 జీవోలాగే దీన్ని నీరుకార్చకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రామకృష్ణానగర్‌తో పాటు ఉన్న అనేక కాలనీల్లో ఈ ఇళ్ల రెగ్యులర్ సమస్యలు ఉన్నాయని, వాటినన్నిటినీ పరిష్కరించాలని కోరారు. గంజిపేటలో 50 ఏళ్లు గా నివాసం ఉంటున్న పేదలకు , ధలితులు ఇళ్లు రెగ్యులర్ చేయాలని, కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ కోరారు. గొడగల వీధిలో గిరిజన పేదలు నివాసం ఉంటున్న చోట రెగ్యులర్ చేయాలని సిపిఎం నగర కమిటీ సభ్యులు బి. రమణ కోరారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం. జగదాంబ పాల్గొన్నారు.
కుంటినవలసలో ప్రజా చైతన్య యాత్ర
మెంటాడ : మండలంలోని లోతుగెడ్డ, కుంటినవలసలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు జి.శ్రీనివాస్, రాకోటి రాములు ఆయా గ్రామాల్లో సమస్యలను తెలుసుకున్నారు. ఇంటింటికి మంచినీళ్లు కుళాయిలు కావాలని, గ్రామంలో నివసిస్తున్న దళితులకు శ్మశానానికి కేటాయించిన 70 సెంట్లు వాళ్ళ ఆధీనంలోకి ఇవ్వాలని, శ్మశానానికి సీసీ రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఎస్‌సి కాలనీకి ఆనుకొని ఉన్న చెరువుగట్టు ర్యాంప్ ను ఎత్తు చేయాలని సిపిఎం బృందానికి ప్రజలు విన్నవించారు. ఈ సందర్భంగా జి.శ్రీనివాస్, పార్టీ సభ్యులు లింగాల వెంకట్రావు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకనే ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి చైతన్యపరిచి సమస్యల పరిష్కారం కోసం స్థానిక అధికారులకు వినతి పత్రాల సమర్పిస్తామని చెప్పారు. చాకలి కృష్ణ, జంగం అప్పన్న, లింగాల అప్పారావు, చాకలి అప్పారావు, జంగం గౌరీ, శంకర్, ఎర్రి నాయుడు, లింగాల గౌరమ్మ, పైల సన్యాసమ్మ, పైడిలక్ష్మి పాల్గొన్నారు.