ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : శాసన మండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వైసిపిలో కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన ఆయనకు పార్టీలో అనేక అవమానాలు ఎదురయ్యాయి. 2019 వైసిపి టిక్కెట్ ఇవ్వలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతోపాటు మంత్రి పదవి ఇస్తానని అప్పట్లో వైసిపి అధినేత వైఎస్ జగన్ చిలకలూరైపేట ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు. కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్‌ను పక్కన పెట్టారు. అంతే గాక 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన విడదల రజనీ కూడా రాజశేఖర్‌కు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయినా నాలుగేళ్లు మౌనంగా ఉన్న రాజశేఖర్‌కు 2023లో అప్పటి సిఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. తరువాత చిలకలూరిపేటలో అప్పటికే మంత్రి విడదల రజనీపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జిగా మార్చి ఎన్నికల్లో పోటీ చేయించారు. అయితే చిలకలూరిపేట నుంచి ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో మర్రి రాజశేఖర్‌తో ఏమాత్రమూ సంప్రదించకుండా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకు టిక్కెట్ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన తరువాత తిరిగి మాజీ మంత్రి విడుదల రజనిని మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో తీవ్ర అసంతృప్తి గురైన మర్రి రాజశేఖర్ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు ఉంటున్నారు. అయినా పార్టీ అధిష్టానం గత ఆరునెలలుగా ఆయనను పిలిచి ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేగాక జగన్ను కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదు. దీంతో ఆరు నెలలగా పార్టీకి క్రమంగా దూరమయ్యారు. తాజాగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా రాజశేఖర్ తన పదవితోపాటు పార్టీకీ రాజీనామా చేశారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో వివరణ కోసం మర్రి రాజశేఖర్‌ను ‘ప్రజాశక్తి’ సంప్రదించగా తాను పార్టీకి రాజీనామా చేయలేదని, ఈ వివరాలపై గురువారం మీడియాతో మాట్లాడతానని చెప్పారు.
