ప్రజాశక్తి – ఆదోని : దశాబ్ద కాలంగా చాలీచాలని వేతనాలకు పనిచేస్తున్నామని ప్రభుత్వం తమ పట్ల కనికరం చూపడం లేదని మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ నాయకులు వాపోయారు. సోమవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ చైర్ పర్సన్ శాంతా కు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు సోమన్న అహ్మద్ శివరాం శివ పీరా మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ26,000 ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఇప్పటివరకు చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తమ సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం చేస్తున్న తమకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయడం లేదన్నారు. అరాకొర వేతనంతో పిల్లలకు స్కూలు ఫీజు చెల్లించుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో గతంలో తమ డిమాండ్లను విన్నవించగా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని లేని ఎడల విధులను బహిష్కరించి ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, కృష్ణమూర్తి, కర్రెప్ప, రామాంజనేయులు, కైలాష్ తదితరులు ఉన్నారు