ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ‘ చర్మవ్యాధికి గురవుతున్న వీధి కుక్కలు ‘ అనే శీర్షికతో మంగళవారం తూర్పు గోదావరి జిల్లా ఎడిషన్‌లో వచ్చిన ప్రజాశక్తి వార్తకు అధికారులు స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇచ్చిన ఆదేశం మేరకు డాక్టర్ యు ముకేశ్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ యు.ముకేశ్ మాట్లాడుతూ … గ్రామంలో చర్మవ్యాధులకు గురైన వీధి కుక్కలను, గజ్జి కుక్కలను గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువస్తే వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ … గతంలో వీధికుక్కులను తమ సిబ్బంది పట్టుకుని వ్యాక్సిన్ వేయిస్తుండగా, గ్రామాల్లోని ఒక యూట్యూబ్ ఛానల్ కుక్కల్ని పట్టి చంపేస్తున్నట్లుగా వదంతు కల్పించి ఆ వార్తను యూట్యూబ్ ఛానల్ గ్రూపులో పెట్టిందని తెలిపారు. దాంతో తమ ఉద్యోగ భద్రత కోసం కుక్కలను పట్టడం ఆపేశామన్నారు. అయితే ఇప్పుడు ప్రజాశక్తి ఇచ్చిన వార్తకు స్పందించిన ఉన్నతాధికారలు తమను ఆదేశించారని, వీధి కుక్కలను తాము పట్టి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వ్యాక్సిన్లు వేసి వెంటనే వదిలేస్తామని స్పష్టం చేశారు.
