రీసర్వే అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ప్రజాశక్తి – రాయచోటి రీ సర్వే ప్రక్రియలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, సర్వే శాఖ అధికారులతో సిసిఎల్‌ఎ జయలక్ష్మి, రీ సర్వే ప్రక్రియ పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని విసి హాల్‌ నుంచి కలెక్టర్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిసిఎల్‌ఎ జయలక్ష్మి మాట్లాడుతూ ఎపిలో 6,860 గ్రామాలలో రీ సర్వే ప్రక్రియ పూర్తయిందని, రీ సర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాలలో గ్రామసభల ద్వారా వచ్చిన సమస్యలు, అర్జీలపై జిల్లా కలెక్టర్లు, సర్వే శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన గ్రామసభలలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, సర్వే శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఒ మధుసూదరావు, ఏడీ సర్వే భరత్‌ పాల్గొన్నారు.

➡️