విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ రెడ్డి మృతి

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : కృష్ణా జిల్లా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, అభ్యుదయవాది, వామపక్ష శ్రేయోభిలాషి దుగ్గిరాల సత్యనారాయణ రెడ్డి (85) బుధవారం మరణించారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడ ఎల్‌ఐసి కాలనీ జయప్రకాష్‌ నగర్‌లోని స్వగృహంలో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఉమ్మడి కష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉద్యమాలతో ఆయనకు అనుబంధం ఉంది. గుంటూరు జిల్లా గురజాల మండలం అంబాపురంలో జన్మించిన సత్యనారాయణరెడ్డి ప్రజాతంత్ర ఉద్యమాలకు బాసటగా ఉండేవారు. ఉద్యోగ విరమణ తర్వాత హక్కుల ఉద్యమాలు ఇస్కఫ్‌, శాంతిస్నేహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. వినియోగదారుల కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్‌లోని గోద్రా దుర్ఘటన సమయంలో ప్రజలను చైతన్య పరిచేందుకు కషి చేశారు. న్యాయమూర్తిగా ఉన్న సమయంలో పెండింగ్‌లో ఉన్న అనేక కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ ఏర్పాటు చేసి ఒక్కరోజులోనే 350 కేసులు పరిష్కరించారు. ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం గ్రామ స్థాయిలో సత్వర న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ బిడి శర్మ ఉద్యమం మాదిరిగా ‘మన ఊరు మన రాజ్యం’ కావాలని కోరుకునేవారు. ఇటీవల వరకు వామపక్ష, అభ్యుదయ శక్తులు నిర్వహించిన సభలకు, సమావేశాలకు హాజరయ్యేవారు. ఆయన అంత్యక్రియలు విజయవాడలోని జయప్రకాష్‌నగర్‌లో జరిగాయి. ఆయన భౌతికకాయాన్ని పలువురు వామపక్షాల నాయకులు, న్యాయవాదులు, సాహితీవేత్తలు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు.

➡️