మాట్లాడుతున్న కలెక్టర్
ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో శుక్రవారం నుండి వచ్చేనెల 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. గురువారం కలక్టరేట్‌లో రెవెన్యూ సదస్సులు, 7న మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ ఏర్పాట్లపై కలెక్టర్ నాగలక్ష్మి విలేకరుల సమావేశంలో వివరించారు. గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో రైతులు, భూ యజమానుల ధ్రువపత్రాలు పరిశీలించి సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పరిష్కరించటానికి రెవెన్యూ సదస్సులు తోప్పడతాయన్నారు. మండలంలో రోజుకు ఒక గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేసి, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకూ సిబ్బంది అదే గ్రామంలో ఉండి, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారినికి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. రెవెన్యూ శాఖతోపాటు సర్వే, రిజిష్ట్రేషన్, కొన్ని ప్రాంతాల్లో దేవాదాయ శాఖ, వక్ఫ్‌బోర్డు సిబ్బంది, అటవీశాఖ, పంచాయతి, మున్సిపల్, పోలీసు సంబంధించి అర్జీలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా శాఖల సమన్వయంతో సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల నుండి గ్రామ సభకు అధికారులను నియమించామన్నారు. ముందుగానే ఆ గ్రామానికి సంబంధించి రెవెన్యూ రికార్డులను, అడంగళ్, 22 -ఎ లిస్ట్, హౌసింగ్, అసైన్డ్ ల్యాండ్ సమాచారం, సబ్ డివిజన్ సమాచారం తయారు చేసి గ్రామాల్లోకి తీసుకువెళ్తారనానరు. గ్రామంలోని సమాచారం సరిగ్గా వుందో లేదో ఈ రికార్డులతో చెక్ చేసుకోవచ్చన్నారు. రైతులు, ఇతర ల్యాండ్ యజమానులు వారి రికార్డులతో సరిచూసుకొని ఏమైనా తేడాలుంటే గ్రామ సభలో అక్కడిక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. గ్రామసభ జరిగే గ్రామంలో ఆ రోజుకు సబ్ డివిజన్, మ్యూటేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, రైతులెవరికైనా సమస్యలుంటే ఆ రోజు వరకు ఉచితంగా సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచే లక్ష్యంతో ఈనెల 7వ తేదీన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యాల్లోని 1064 పాఠశాల్లో ఈ మీటింగ్‌లు నిర్వహించటానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మీట్‌లో విద్యార్థి చదువు విషయంలో, ఇతర అంశాల్లో ఏవిధంగా ఉన్నాడో తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకోవచ్చన్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో విద్యార్థి ప్రగతికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందిస్తారని, దీంతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రజాప్రతినిధులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, తల్లిదండ్రులతో కలిసి సమావేశం ఉంటుందని తెలిపారు. అనంతరం పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పిల్లల తల్లితండ్రులకు కూడా అందిస్తారన్నారు. పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, డిఆర్‌ఒ ఎన్.ఎస్.కె. ఖాజవలి, డిఇఒ సి.వి.రేణుక పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి
గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ దిగ్విజయంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ డెవల్మేంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్ధయ్యతో కలిసి రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమన్వయ కమిటీ సమవేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ మ్యాపులను ప్రభుత్వ భూములను వివిధ రంగుల్లో మార్కింగ్ చేసి గ్రామాలలో ప్రస్ఫుటమైన ప్రదేశములలో ఉంచాలన్నారు. 33 రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి, తర్వాత 45 రోజులలో సదరు సమస్యలపై స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉందన్నారు. సదస్సులో ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని ఆన్‌లైన్ నందు నమోదు చేయాలన్నారు. సమావేశంలో కెఆర్‌ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్ డి.శైలజ, ఆర్‌డిఒ శ్రీనివాసులు పాల్గొన్నారు.