ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌పై సమీక్ష

Jun 10,2024 21:25

ప్రజాశక్తి – గరుగుబిల్లి: కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో ఇటీవల చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌పై సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అయితే ఆయా గ్రామపంచాయతీల్లో ప్రస్తుత సీజన్‌లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేలా పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గ్రామపంచాయతీల పరిధిలో పలుచోట్ల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని ఇఒపిఆర్‌డి ఎల్‌.గోపాలరావు తెలిపారు. సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు తిరుపతి, భాస్కరరావు, సూరు శ్రీనివాసరావు, అడ్డూరి లలితకుమారి, పువ్వల శిరీష, తదితరులు పాల్గొన్నారు. సీతానగరం : గ్రామాల్లో సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎంపిడిఒ ఎం.ఈశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులు, మంచినీటి సౌకర్యం, ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు వచ్చే సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. సమావేశంలో ఇఒపిఆర్‌డి కెకె వర్మ, పలువురు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.సీతంపేట : ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు, మలేరియా నివారణా చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎంపిడిఒ కె.గీతాంజలి అన్నారు. పంచాయితీ కార్యదర్శులతో జరిఇన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీతంపేట మలేరియా అధికారి మోహన్‌రావు మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శులంతా గ్రామాల్లో మలేరియా వ్యాప్తి చెందకుండా, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం పంచాయతీ కార్యదర్శి ఆరోగ్య సిబ్బంది, వెలుగు సిబ్బంది గ్రామాల్లో ఫాగింగ్‌ స్ప్రేయింగ్‌, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎపిఎం విజయ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️