ప్రజాశక్తి-టంగుటూరు : జరుగుమల్లి మండల వ్యవసాయధికారి డి యుగంధరరెడ్డి శుక్రవారం గ్రామ వ్యవసాయ సహాయకులకు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు అంశాల పురోగతి గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రబీ సీజను పంట నమోదు త్వరితగతిన 100 శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. శనగ, పొగాకు పంటలలో పంట కోత ప్రయోగానికి సంబంధించిన ఫారాలను సకాలంలో సంబంధిత ఉన్నతాధికారుల కార్యాలయాలకు పంపాలని కోరారు. వ్యవసాయ అనుబంధ శాఖల సాంకేతిక సలహా కరదీపిక అనగా పాడిపంటల మాసపత్రికలకు సంబంధించి ప్రతి రైతు సేవా కేంద్రానికి నిర్దేశించిన 15 మాసపత్రికలకు చందా రుసుమును త్వరతిగతిన రైతుల నుంచి ప్రభుత్వ పాడిపంటల ఖాతాకు జమచేసి ప్రతి నెల క్రమం తప్పకుండా సదరు రైతులకు పాడిపంటల మాస పత్రికలను ఆయా గ్రామ సహాయకులు వారి ఇంటికి వెళ్లి అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్నట్లుగానే, ప్రతి రైతుకి కూడా ఒక ప్రత్యేకమైన నెంబర్ ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించారు. పంటల బీమా, ప్రథాన మంత్రి సమాన్ నిధి, అన్న దాత సుఖీభవ, పంట నష్టం పరిహారం, బ్యాంకు రుణం మొదలైనవి పొందడానికి రైతులందరూ తప్పనిసరిగా ఈ ప్రత్యేకమైన నెంబర్ పొందాలని, అందుకు గ్రామంలో ఉన్న ప్రతి రైతునూ సంబంధిత గ్రామ సహాయకులు వారు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్‌లో రైతుల వివరాలను రిజిస్టర్ చేయాలని గ్రామ సహాయకులకు తెలిపారు. ఈ నెలలో పిఎం కిసాన్ 19వ విడత రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. జరుగుమల్లి మండలంలోని బ్యాంకు ఖాతాకు వారి ఆధార్ అనుసంధానం కాకుండా 177 మంది రైతులు, అలాగే ఈకెవైసి కాకుండా 34 మంది రైతులు ఉన్నారని అన్నారు. వీళ్లకు ప్రత్యేకంగా సదరు సమాచారాన్ని అందజేసి వారితో గ్రామ సహాయకులు వేలిముద్ర వేయించడం అలాగే పోస్ట్ ఆఫీసు ద్వారా కొత్త ఖాతాను ఓపెన్ చేయించడం ద్వారా పై రెండు సమస్యలు తొలగి పైన తెలిపిన 211 మందికి కూడా పిఎం కిసాన్ నగదు వస్తుందని తెలిపారు. కాబట్టి అర్హులు లబ్ధి పొందేలా చూడాలని, అలాగే ఎవరైనా అనర్హులని నిర్దారణ జరిగితే అనగా మరణించినా లేక పొలం అమ్ముకున్న రైతులు అనర్హుల కిందకు వస్తారని, వారిని జాబితా నుంచి తొలగించడానికి అవసరమైన సమాచార వివరాలను మండల వ్యవసాయ అధికారికి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సహాయ గణాంక అధికారి సుబ్రమణ్యం, వ్యవసాయ విస్తరణాధికారి శ్రీలేఖ, సిబ్బంది పాల్గొన్నారు.
