ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ రహదారి భద్రతా నియమాలు..సురక్షిత ప్రయాణానికి సోపానాలని, రోడ్డు జిల్లా రవాణా అధికారి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా రవాణా అధికారితో పాటు మదనపల్లి ఆర్‌టిఒ అశోక్ ప్రతాప్‌రావు, ఎంవిఐలు శివలింగయ్య, దినేష్ చంద్ర, శ్రీహరి, జనజాగతి సమాజ సేవాసమితి వ్యవస్థాపకులు బాలజ్యోతి, హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిటిఒ ప్రసాద్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు, రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, నాలుగు చక్ర వాహనదారులకు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించాలన్నారు. జనవరి 15న ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఫిబ్రవరి 15న ముగియనున్నాయని తెలిపారు. విద్యార్థులు రహదారి భద్రత నియమాలపై కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అతివేగం అనర్థదాయకం, మితవేగం ఆనందదాయకమని వెల్లడించారు. పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులచే స్థానిక మహిళా డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ చేపట్టి, బెంగళూరు బస్టాండులో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలపై వివిరిస్తున్న డిటిఒ ప్రసాద్
రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలి – జిల్లా రవాణా అధికారి ప్రసాద్
