ప్రజాశక్తి-విజయనగరం : ప్రయాణికులంతా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం కోట జంక్షన్ వద్ద చేపట్టిన ర్యాలీని ఎస్‌పి ప్రారంభించారు. అక్కడి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలు పాటించకుంటే ప్రమాదాలు జరుగుతాయన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. చాలా వరకు వాహనదారులు తమకు డ్రైవింగు చక్కగా వచ్చునని, తనకు ప్రమాదాలు జరగవన్న భావనతో ఉంటారన్నారు. హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వాహనదారులు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుండి బయటపడమ వచ్చునన్నారు. మైనర్లు ఎక్కువగా డ్రైవింగు చేసి, ప్రమాదాలకు గురవ్వడం లేదా ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ప్రతీ ఏడాది మన జిల్లాలో రహదారి ప్రమాదాల కారణంగా సుమారు 400మంది మరణిస్తుండగా, మరో 900 మంది గాయపడు తున్నారన్నారు. వాహనాలను నడపడంలో నిర్లక్ష్యం కారణంగా ఏ తప్పూ చేయని ఇతర వ్యక్తులు కూడా ప్రమాదాలకు గురై, దురదష్టవసాత్తు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రోటరీ క్లబ్ గవర్నరు డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు తప్పని సరిగా రహదారి భద్రత ప్రమాణాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని ప్రజలను కోరారు.అనంతరం, ర్యాలీలో పాల్గొన్న యువతీ, యువకులు, ప్రజలతో భద్రత ప్రమాణాలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో రోటరీ గవర్నరు డా.ఎం.వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ వినోద్, డాక్టర్ పద్మకుమారి, సూర్యలక్ష్మి, డిఎస్‌పి ఎం.శ్రీనివాసరావు, సిఐలు ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, ఎవి లీలారావు, తదితరులు పాల్గొన్నారు.
