రోడ్డు సౌకర్యం లేక ఉప్పు రైతుల ఇక్కట్లు

ప్రజాశక్తి-కొత్తపట్నం : ఉప్పు కొటారు రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం నాయకుడు జీవీ కొండారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం కొత్తపట్నం ఉప్పు రైతులు సమస్యలపై సిపిఎం బృందం పర్యటన చేయటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ఉప్పు కొటారు భూములు సాగు చేస్తున్న రైతుల కరెంటు మోటార్లకు ఇండిస్టియల్‌ కింద ఒక్కొక్క రైతుకు నెలకు రూ.2000 నుంచి రూ.5000 వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయని అన్నారు. అకాల వర్షాలు, గిట్టుబాటు రేటు లేకపోవడం తదితర కారణాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఉప్పు రైతులకు కరెంటు భారం తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు. అగ్రికల్చర్‌ లాగే ఉప్పు రైతులకు కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య మాట్లాడుతూ ఉప్పు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రవాణా సౌకర్యం కొరకు రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ స్వామిరెడ్డి మాట్లాడుతూ ఉప్పు రైతులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ ఆంజనేయులు, కే శీను, కే శ్రీరాములు, టి నాగార్జున, రఘు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి: బూదవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లయ్య నగర్‌లో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఎల్లయ్య నగర్‌ కాలనీలో సిపిఎం బృందం పర్యటించింది. స్థానిక ప్రజలు పలు సమస్యలు సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. శివారు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురుగునీరు పేరుకొనిపోయి దోమలు తీవ్రమవుతున్నా యని అన్నారు. గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌ ప్రహరీ గోడ సైడ్‌ కాలువకు అడ్డంగా ఉన్నందున ఇబ్బందులు పడుతున్నారని, దానిని వెంటనే తొలగించాలని కోరారు. నిరుపయోగంగా ఉన్న వాటర్‌ ట్యాంక్‌ను వినియోగం లోకి తెచ్చి ఇంటింటికీ కొళాయి ద్వారా మంచినీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎల్లయ్య నగర్‌ కాలనీ చుట్టూ కంకర మిల్లులు, గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు ఉండటం వలన వాతావరణ కాలుష్యం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, మండల నాయకులు శీలం ఆదినారాయణ, నుగు శ్రీను, జి ప్రభుదాసు, ఎస్‌ లక్ష్మీనారాయణ, ఇమ్మానియేలు పాల్గొన్నారు.

➡️