ప్రజాశక్తి-యంత్రాంగం ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గెడ్డలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆనందపురం : ఆనందపురం- పెందుర్తి రహదారిలో వర్షం నీరు రహదారిపై చేరి చెరువులను తలపించే విధంగా తయారైంది. ఆనందపురం పెందుర్తి రహదారిలో దుక్కవాణిపాలెం, మిందివానిపాలెం వద్ద నీరు పోవడానికి మార్గం లేక రోడ్డుపై సుమారు 4 అడుగుల ఎత్తులో నీరు చేరింది. వాహనదారులు అతి కష్టం మీద ప్రయాణాలు సాగించారు. గెడ్డలను కబ్జాలు చేస్తుండటంతో నీరు పోవడానికి మార్గం లేక రోడ్లపైకి వచ్చి చేరుతోంది. పద్మనాభం : మండలంలోని పద్మనాభం – రెడ్డిపల్లి రోడ్డు చెరువును తలపిస్తోంది. రోడ్డు మధ్యలో గుంతల్లో వర్షపు నీరు నిండింది. విజయనగరం -సింహాచలం ప్రధాన రోడ్డు కావడంతో ఎక్కువగా వాహనాలు తిరుగుతుంటాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి అధ్వానంగా ఉంది. పెందుర్తి : 96వ వార్డు పరిధి పెందుర్తి కూడలి సమీపంలో బిఆర్‌టిఎస్ రోడ్డంతా జలమయమైంది. పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిఆర్‌టిఎస్ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిల్వ చేరుతోంది. నరవ నుంచి సబ్బవరం వెళ్లే రోడ్డులో జెర్రిపోతుల పాలెం వద్ద రోడ్డంతా బురదమయంగా మారింది. ములగాడ : జివిఎంసి 40వ వార్డు పరిధి ఎకెసి కాలనీ కూడలి వద్ద ప్రధాన రహదారి కల్వర్ట్‌లో పూడికలు పేరుకు పోవడంతో వర్షపు నీరు, మురుగు నీరు రహదారిపైకి చేరుతోంది. మల్కాపురం పోలీస్టేషన్‌లోకి, ఎకెసి.కాలనీ నివాస గృహాల్లోకి నీరు చేరింది. స్థానిక కార్పొరేటర్ డాక్టర్ గుండపు నాగేశ్వరరావు శనివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య సిబ్బందితో పూడికలను తొలగించే ప్రయత్నంచేశారు.
