జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్ల కేటాయించాలి

ప్రజాశక్తి-ఒంగోలు సిటీ వెనుకబడిన జిల్లాగా గుర్తించిన ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల కేటాయించాలని, వెలిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని, జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి.రమేష్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. సిపిఎం దశాబ్దకాలం అనేక ఉద్యమాలు, జైలుశిక్షల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకాశాన్ని వెనుకబడిన జిల్లాగా ప్రకటించినట్లు తెలిపారు. అయితే జిల్లా వెనుకబాటుతనాన్ని రూపుమాపే దిశగా నిధులు కేటాయించలేదని తెలిపారు. పాలకవర్గాలు సైతం జిల్లా అభివద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. జిల్లా అభివద్ధి చెందాలంటే నిధులు కేటాయించా లన్నారు. దామాషా ప్రకారం నిధులు రాబట్టేందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రజాభివద్ధిని విస్మరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌, ఆక్వా, పొగాకు వంటి వనరుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 20 వేల కోట్లు జమ అవుతున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజానీకానీకానికి చెందిన ఈ సంపదలో జిల్లా వాటాగా రూ.10 వేల కోట్లు ఒకే విడత ప్యాకేజీగా అందిస్తే జిల్లాలోని వెలుగొండ, సంగమేశ్వరం, పాలేటిపాడు, గుండ్లకమ్మ వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు. వ్యవసాయం అభివద్ధి చెందుతుందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పారిశ్రామికంగా అభివద్ధి పొంది జిల్లా అన్నింటా ప్రగతిని సాధిస్తుందన్నారు. సాగునీటి వనరులు లేక వ్యవసాయం అభివద్ధి చెందక ఉపాధి అవకాశాలు కరువై ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం వలస పోతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రం రూ.46 వేల కోట్ల అప్పు చేయటం ప్రజలకు భారంగా పరిణమిస్తుందని, కేంద్రం ప్రకటించిన రూ.లక్ష కోట్ల గ్రాంట్‌ కోసం ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగ, ఉపాధి, పారి శ్రామికంగా వెనుకబడిన ప్రకాశం జిల్లా బీపీ,షుగర్‌ వంటి వ్యాధుల్లో అగ్రభాగాన ఉందన్నారు. ఉపాధి అవకాశాలు కరువై మానసిక ఒత్తిడికి గురైన ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజల పక్షం వహించాలన్సిన జిల్లా ప్రజాప్రతినిధులు తమ స్వార్ధ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం జిల్లా అభివద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించి ప్రజలను మభ్య పెట్టారని దుయ్యబట్టారు. జిల్లాలో గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు,మూసి వంటి నదుల ద్వారా ఏటా 150 టిఎంసిల నీరు వర్షాకాలంలో సముద్రంలో వృథాగా కలుస్తుందన్నారు. ఆయా నదుల పై సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిన డిమాండ్‌ చేశారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, కనిగిరి నిమ్జ్‌ కోసం వేలాది ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఆ భూములను బీళ్ళుగా మార్చినట్లు తెలిపారు. ఒక్క పరిశ్రమను స్థాపించకపోవడం విచారకరమన్నారు. మూడేళ్ల క్రితం జిల్లాకు ప్రకటించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీకి తగినన్ని నిధులు కేటాయించకపోవడం వల్ల యూనివర్సిటీ రూపురేఖలు ఏర్పడలేదన్నారు. ఈనెల 8 నుంచి 17 వరకు ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు లేవనెత్తిన తాగునీరు, పారిశుధ్యం ,ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు అపరిష్కతంగానే ఉన్నాయని తెలిపారు. పాలకవర్గం చిత్తశుద్ధితో నిధులు కేటాయించి పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు . దర్శిలో డ్రైవింగ్‌ స్కూల్‌, కొత్తపట్నంలో హార్బర్‌, పాకల బీచ్‌ పథకాలు ఎన్నికల హామీలుగా మిగిలాయని తెలిపారు. మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణ అర్ధంతరంగా పనులు నిలుపు చేయడం దారుణమన్నారు. తాగునీరు, పారిశుధ్యఇళ్ల స్థలాలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిపిఎం సీనియర్‌ నాయకులు పెంట్యాల హనుమంతరావు, జిల్లా కమిటీ సభ్యులు పి. వెంకటరావు, కెజి.మస్తాన్‌, కంకణాల రమాదేవి, పెంట్యాల కల్పన మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటి కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు పూర్తిచేయాలన్నారు. కనిగిరి ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. పొగాకు,మిర్చి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరు చేయించి రుణ సదుపాయం కల్పించాలన్నారు. టిడ్కో ఇళ్ళను సత్వరం పూర్తి చేయించి లబ్ధిదారులకు అందించాల కోరారు. ఒంగోలు పట్టణ పరిధిలోని పేదలందరికీ రెండేసి సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జుజ్జూరు జయంతి బాబు, కాలం సుబ్బారావు, వి.బాలకోటయ్య, బంకా సుబ్బారావు, వెల్లంపల్లి ఆంజనేయులు, టంగుటూరు రాము, ఉబ్బా ఆదిలక్ష్మి, పల్లాపల్లి ఆంజనేయులు, కిలారి పెద్దబ్బాయి,టి.శ్రీకాంత్‌, ఎస్‌,స్వామిరెడ్డి, నెరుసుల వెంకటేశ్వర్లు, వి.మోజస్‌, తంబి శ్రీనివాసులు, టి.మహేష్‌, కెఎఫ్‌,బాబు, ఎస్‌డి.హుస్సేన్‌, కంకణాల వెంకటేశ్వర్లు, ఎస్‌కె.అమీర్‌, ఉబ్బా వెంకటేశ్వర్లు, దామా శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️