ప్రజాశక్తి – నూజెండ్ల : పురుగుమందులు, ఎరువుల విక్రయాలపై విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. నూజెండ్ల మండలం మూర్తిజాయపురంలో హరిణి ఫర్టిలైజర్స్ షాపులో తనిఖీలు చేయగా అనుమతులు లేకుండా ఎరువులు, పరుగు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. షాపులో పురుగుమందులు, ఎరువులు ఇన్వాయిస్లను, రిజిస్టర్లు, లైసెన్సులను పరిశీలించగా సరైన అనుమతి పత్రాలు లేవని నిర్థారణకు వచ్చారు. అనుమతులు లేకుండా ఎరువులు పురుగు మందులు విక్రయిస్తున్న హరిణి ఫర్టిలైజర్స్ షాప్ యజమానిపై 6ఎ కేసు నమోదు చేయడంతో పాటు రూ.6.83 లక్షల సరుకును సీజ్ చేశారు. తనిఖీల్లో రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి చల్లగుండ్ల ఆదినారాయణ, ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ శాఖ అధికారులు, నూజెండ్ల మండల వ్యవసాయ అధికారి సుగుణ బేగం పాల్గొన్నారు.