ధర దక్కక వరి రైతులకు రూ.60 కోట్ల నష్టం

Dec 13,2024 00:07

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అన్ని పంటలనూ ఎటువంటి నిబంధనలూ లేకుండా మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రామారావు, వై.రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేశారు. పంటలకు మద్దతు ధరలిస్తే రైతులు బాగుంటారని, పంటలనూ ఉత్సాహంగా సాగు చేస్తారని, కొనుగోలు శక్తి పెరిగిఅ న్ని రంగాలూ అభివృద్ధి బాటలో ఉంటాయని పేర్కొన్నారు. పత్తికి ప్రభుత్వం మద్దతు ధర రూ.7521 ప్రకటించినా తేమ శాతం ఎక్కువ ఉందని నాణ్యత తక్కువ ఉందని వంకలు చెప్పడంతో రైతులకు సిపిఐ కొనుగోలు కేంద్రాల్లో అసలు ధర దక్కడం లేదని తెలిపారు. దీంతోపాటు రైతుల కంటే దళారులకే ప్రాదాన్యమిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో కాకుండా జిన్నింగ్‌ మిల్లులవద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతుల నుండి వచ్చిన సరుకుని సకాలంలో కొనుగోలు చేయకపోవడం తదితర ఇబ్బందుల వల్ల రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. రూ.5500 నుండి రూ.6500కే పత్తిపంట అమ్ముకోవడం ద్వారా ఎకరాకు రూ.10-20 వేల వరకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరిపంట నూర్పిడి దశలో ఉన్నా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలేమీ ప్రభుత్వం జారీ చేయలేదని పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి లక్ష్యం కూడా మొక్కుబడిగా ఉన్నాయని, నిబంధనలు సడలించాలని డిమాండ్‌ చేశారు. గోతాలు ఎక్కడా రైతులకు అందుబాటులో లేవని, రాయితీపై కొత్త గోతాలు అందుబాటులో ఉంచాలని కోరారు. పల్నాడు జిల్లాలో 2 లక్షల టన్నులు ధాన్యం దిగుబడికి అవకాశం ఉండగా ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం 5 వేల టన్నులేనని, మద్దతు ధర 75 కిలోల బస్తాకు రూ.1725 ఉన్నా బహిరంగ మార్కెట్‌లో రూ.1300-1400కు మించి కొనడం లేదని తెలిపారు. రైతుల నుండి వచ్చిన సరుకు కంటే దళారుల ద్వారా వచ్చిన సరుకు కొనుగోలుకే మిల్లర్లు ప్రాధాన్యమిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కాటా కూలీలను కూడా రైతుల దగ్గరకు వెళ్లనీయకుండా దళారులే అడ్డుకుంటున్నారని తెలిపారు. రైతుసేవా కేంద్రాల్లో పరీక్షించిన తేమశాతం కంటే మిల్లులో 3 నుండి 5 శాతం అదనంగా చూపిస్తున్నాయని, ఒక్కో పాయింట్‌ శాతానికి రూ.20 ధరకోత విదిస్తున్నారని విమర్శించారు. రవాణా ఛార్జీలు, గోతాల కొనుగోళ్లు, హమాలీ ఛార్జీలు ఇవేవి అమలు కాకపోవడంతో రైతులు నష్టపోతున్నారి, కనీస మద్దతు ధర దక్కక పల్నాడు జిల్లాలో వరి రైతులు రూ.60 కోట్ల వరకు నష్టపోతున్నారని వివరిం చారు. కౌలు రైతులు మరింతగా నష్టపో యి, అప్పులపాలవుతారని పేర్కొన్నారు.మిర్చి పంట మరి కొద్ది రోజుల్లో మార్కెట్‌లోకి వస్తుందని, ప్రభుత్వం కనీస మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుందా? అని రైతులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. గతం కంటే 50 శాతం ధరలు పడిపోయాయని, గతేడాది నుండి మిర్చి ధరలు తగ్గుముఖం పట్టడంతో చాలామంది రైతులు కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేశారని తెలిపారు. పెరిగిన పెట్టుబడులు, చీడ పీడల బెడద, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని కష్ట నష్టాలకు గురైన రైతులకు మద్దతు ధర దక్కక పోవడంతో వారు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను రూ.15 వేలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. యార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, దుర్గిలో ప్రస్తుతం తాత్కాలిక మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని, ఎగుమతులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.

➡️