ఇపిఎస్‌ పెన్షనర్లకు రూ.9 వేలు ఇవ్వాలి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ ఇపిఎస్‌ పెన్షనర్లకు రూ.9 వేలు పింఛను ఇవ్వాలని రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం పిఎఫ్‌ ఆఫీస్‌ ఎదుట ఆల్‌ ఇండియా పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్‌ రూ.9వేలు ఉండాలని పేర్కొన్నారు. రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు జి.చంద్రమౌళి మాట్లాడుతూ పెన్షన్‌ బిక్ష కాదు అది మన హక్కు అన్నారు. వద్ధాప్యంలో పెన్షన్‌ ఒక సామాజిక భద్రతని తెలిపారు. రిటైర్డ్‌ పెన్షనరులకు ఆరోగ్యశ్రీ, తెల్లరేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులలో వైద్య సేవలు కల్పించాలని కోరారు. రైల్వేలో సీనియర్‌ సిటిజన్స్‌ కు రాయితీలు కల్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌ ఆఫీసులో పెన్షన్‌ దారులు సాంకేతిక లోపాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, పరిష్కరించమని వినతి పత్రాలు ఇచ్చిన ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వద్ధులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్‌ రూ.9 వేలు కోసం రానున్న కాలంలో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని సమరశీలమైన ఆందోళన, పోరాటాలకు శ్రీకారం చుడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులురెడ్డి, ఎల్‌ఐసి కడప డివిజనల్‌ కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప, జ్యోతి కెమికల్స్‌ ఫ్యాక్టరీ యూనియన్‌ నాయకుడు చెన్నకేశవరెడ్డి సంఘీభావం, మద్దతు ప్రకటించారు. ధర్నాలో ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సిఆర్‌వి ప్రసాద్‌ రావు, ప్రజా సంఘాల నాయకులు దస్తగిరిరెడ్డి, నారాయణ, చంద్రారెడ్డి, దస్తగిరి, శ్రీకృష్ణదేవర, జిల్లాలోని పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️