ఆర్‌టిసి బస్సు ఆలస్యం-విద్యార్థుల అవస్థలు- తల్లిదండ్రుల్లో భయాందోళనలు

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : విద్యార్థుల కోసం కేటాయించిన పలమనేరు వయా లక్కనపల్లి టు దాసర్లపల్లి ఆర్‌టిసి బస్సు 3 గంటలకుపైగా ఆలస్యంగా వస్తుండటంతో అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలుపడుతున్నారు. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మూడు గంటలపాటు బస్సు ఆలస్యంగా రావడంతో లక్కనపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దాసర్లపల్లి బస్సు కోసం పడిగాపులు కాస్తున్నారు. రేటింగ్‌ పాస్‌ ఉండటంతో, చార్జీకి సరిగ్గా డబ్బులు లేక విద్యార్థులు ఆ బస్సు కోసం ఎదురుచూస్తూ ఇబ్బందులుపడుతూ ఆలస్యంగా ఇండ్లకు చేరుకుంటున్నారు. ఇండ్ల వద్ద విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు చీకటి పడుతున్నా తమ పిల్లలు ఇంటికి చేరుకోలేదని భయాందోళనకు గురవుతున్నారు. పలమనేర్‌ లో విద్యార్థులు ప్రతీరోజూ బస్సు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీనిపై పలమనేర్‌ బస్టాండ్‌ కౌంటర్లో విచారణ కోరగా మాకేం తెలుసు అని కుంటిసాకులు చెబుతూ కౌంటర్‌ వారు వ్యవహరిస్తున్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్‌ స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం బస్సు టైం కు వెళ్లేలా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️