పోస్టర్ ఆవిష్కరిస్తున్న పౌర సంస్థలప్రతినిధులు
ప్రజాశక్తి- గుంటూరు : గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించిన విధంగా శంకర్‌విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని హిందూకాలేజి కూడలి నుండి లాడ్జి సెంటర్ వరకూ ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని కోరుతూ ఈనెల 10న నగరంలో భారీ మానవహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బెటర్ శంకర్ విలాస్ ఫైఓవర్ సాధన జెఎసి నాయకులు ఎల్.ఎస్.భారవి తెలిపారు. మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శంకర్ విలాస్ సెంటర్ వద్ద మంగళవారం జెఎసి నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారవి మాట్లాడుతూ గతంలో గల్లా జయదేవ్ ఎంపిగా ఉన్నప్పుడు…ఇటీవల ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హిందూకాలేజి నుండి లాడ్జి సెంటర్ వరకూ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పటంతో ప్రజలు సంతోషించారని, కానీ తాజాగా ఆమోదించిన డిజైన్ అందుకు భిన్నంగా ఉందన్నారు. అరండల్ పేట 8,9 లైన్లు నుండి ఏసీ కళాశాల వరకు కుదించి 930 మీటర్లు మాత్రమే నిర్మిస్తున్నట్లు, ఆర్‌యుబి కూడా సాధ్యం కాదని ఇటీవల కలెక్టర్ ప్రకటించారన్నారు. ప్రస్తుత డిజైన్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. కావున సేతుబంధన్ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిక్‌కు నిధులు సరిపోవనే సాకుతో పొడవు కుదించటం సరికాదన్నారు. అవసరం అయితే అదనపు నిధులు సాధించి పాత ప్రతిపాదన ప్రకారమే నిర్మించాలని కోరారు. అలాగే ఆర్‌ఓబికి ముందే ఆర్‌యుబి నిర్మించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లపాటు బ్రిడ్జి నిర్మాణం కోసం ట్రాఫిక్ మళ్లిస్తే ప్రత్యామ్నాయ మార్గాల సామర్థ్యం సరిపోదన్నారు. కావున భవిష్యత్ కోసమైనా ముందుగానే ఆర్‌యుబి నిర్మించాలన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శంకర్‌విలాస్ ఓవర్ బ్రిడ్జి సమస్య కేవలం వ్యాపారస్తులకు సంబంధించిందే కాదని లక్షలాదిమంది ప్రజలకు సంబంధించిన సమస్యని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను గుర్తించి, అదనపు నిధులు కేటాయించి, హిందూ కళాశాల వద్ద నుండి లాడ్జి సెంటర్ వరకు నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రేట్‌పేయిర్స్ అసోసియేషన్ నాయకులు వల్లూరి సదాశివరావు, జెవివి నాయకులు జి.వెంకటరావు ఆటో యూనియన్ జేఏసీ నాయకులు మస్తాన్‌వలి, ఎల్‌ఐసి నాయకులు రాజేశ్వరరావు, అరండల్‌పేట బ్రాడీపేట వ్యాపారస్తుల జేఏసీ నాయకులు కమలకాంత్, సాంబశివరావు, మహిళా జేఏసీ కళ్యాణి, వివిధ పౌర సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
