డబ్బుల కోసం ఇంటి వద్ద కుర్చున్న మైక్రో ఫైనాన్స్ సిబ్బంది
ప్రజాశక్తి – ప్రత్తిపాడు : ప్రజల్ని అప్పుల ఊబిలో కూరుస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు మరో అడుగు ముందుకేసి మహిళలను వెంటాడుతున్నాయి. ఈ వేధింపులను తట్టుకోలేని పలువురు ఊళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. సిందుజా మైక్రో క్రెడిట్ చెందిన ఫైనాన్స్ కంపెనీ వారు నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోని మాబునగర్ కాలనీకి చెందిన 10 మంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున గత మార్చిలో రుణమిచ్చారు. ఆ తర్వాతి నుండి నెలకు రూ.రెండు వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. అయితే పనుల్లేక కొంతమంది మహిళలు నిర్ణీత సమయానికి వాయిదా డబ్బులు చెల్లించలేకపోతున్నారు. దీంతో ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. ఇళ్లవద్దకు వచ్చి కూర్చుని డబ్బులిస్తేనే కదులుతామని పట్టుబడుతున్నారు. దీంతో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు.
కోడలు ఊరు వదిలెళ్లింది : పిక్కిలి సాలమ్మ
మా కోడలు సిందూజా మైక్రో క్రెడిట్ సంస్థ నుండి రూ.40 వేలు తీసుకుంది. డబ్బుల కోసం వారు ఒత్తిడి చేస్తుండడంతో అది తట్టుకోలేక ఊరు వదిలి వెళ్లారు. ఫైనాన్స్ వారు మాత్రం డబ్బులు కట్టాలని రోజూ మా ఇంటి వద్దే కుర్చీలేసుకుని కూర్చుంటున్నారు.