చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖలు

Jun 10,2024 23:48

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేసిన గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్‌కు రెండు శాఖలను కేటాయించారు. సోమవారం విడుదల చేసిన శాఖల్లో పెమ్మసానికి కీలకమైన గ్రామీణా భివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయమంత్రిగా నియమించి నట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఆయనకు వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి పదవి వస్తుందని భావించినా గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు రావడం కొంత మెరుగైన పరిణామం అని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి ద్వారా జిల్లాకు నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చని అంచనా వేస్తున్నాయి. గతంలో యుఎన్‌పిఎ హయాంలో ఈ శాఖను అప్పట్లో కింజారపు ఎర్రంన్నాయుడుకి కేటాయించారు. తద్వారా గ్రామీణాభివృద్ధికి పథకాలకు అప్పట్లో నిధులు ఎక్కువ తేగలిగారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన, జలజీవన్‌ మిషన్‌ వంటి పథకాలకు నిధులు ఎక్కువగా తెచ్చుకోగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి, తాగునీటి పథకాలకు బాగా వినియోగించుకోవచ్చునని అధికారులు తెలిపారు.

➡️