పట్టుబడిన నిందితులతో ఎస్పీ సతీష్‌కుమార్, ఇతర పోలీసు అధికారులు
ప్రజాశక్తి-గురటూరు జిల్లా ప్రతినిధి : ఆటో డ్రైవర్ల ముసుగులో నేరాలకు పాల్పడుతున్న 3 ముఠాలకు చెందిన 10 మందిని వేర్వేరు ప్రదేశాల్లో అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్‌పి ఎస్.సతీష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలను మీడియాకు మంగళవారం వెల్లడించారు. పట్టుబడ్డ వారిపై ఐదు కేసులు నమోదయ్యాయని, వీరి వద్ద నుంచి 15 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిపై ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, పల్నాడు, విజయవాడ సిటీ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు సంబంధించి కేసులున్నాయని తెలిపారు. కొన్నేళ్లుగా దొంగతనాలనే వృత్తిగా చేసుకునిన్న వీరు.. ఆటోలో ఎక్కే 50-70 ఏళ్ల వయస్సుండే పల్లెటూళ్లకు చెందిన ప్రయాణికులను ఎంచుకుని వారిని బెదిరించి, విలువైన వస్తువులు దోచుకుంటున్నారని ఆయన తెలిపారు. నిందితులందరూ గుంటూరు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించామన్నారు. తెనాలిలో ఇందుకు సంబంధించిన తొలి ఘటన వెలుగు చూసిందన్నారు. తెనాలి 3వ పట్టణ పోలిస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లమని చెప్పుకుంటూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తులను ఆసరా చేసుకుని వారు వెళ్లే ప్రాంతం గురించి అడిగి, తాము కూడా అక్కడికే వెళ్తున్నామని వారిని ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశంలోనికి తీసుకెళ్లి బెదిరించి సొత్తు కాజేసి పరారవుతున్నారని గుర్తించామని, వీరిని విచారణ చేయగా మిగతా ఘటనలు కూడా బయటకు వచ్చాయని వివరించారు. నిందితుల్లో గుంటూరుకు చెందిన పానుగంటి వెంకటేశ్వరరావు ఒక ముఠాకు లీడర్‌గా షేక్ ఖాజా, ముడియాల సుందర్శన్‌రెడ్డి, వాల్తేరు క్రాంతి, మద్దూరి రమేష్ కలసి దోపిడీలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. బడుగు శాంసన్ అనే నిందితుడు మరో ముఠాకు లీడర్‌గా ఉండి ఎలమంచిలి రామారావు, ఒర్చు వెంకటేష్, కూరపాటి శ్రీనివాసరావులు నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. పాతగుంటూరు ప్రాంతానికి చెందిన షేక్ కాలేషా కూడా ఇదే తరహాలో దోపిడీ చేసినట్టు గుర్తించామన్నారు. నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన తెనాలి త్రీటౌన్ సిఐ రమేష్, కానిస్టేబుల్స్ జయకర్‌బాబు, మురళీ, శ్రీనివాసరావు, రామకృష్ణ, నరేంద్ర, నాగశ్రీను, శ్రీ రామమూర్తికి రివార్డులు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి సుప్రజ, తెనాలి డిఎస్‌పి జనార్ధనరావు, స్పెషల్ బ్రాంచి డిఎస్‌పి సీతారామయ్య పాల్గొన్నారు.