ఆర్డబ్ల్యూఎస్‌ కార్యాలయం – ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : నాలుగు గోడల మధ్య కూర్చుని అక్రమంగా డబ్బు సంపాదించటం ఎలానో ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయ సిబ్బందికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కమిషన్లు ఇస్తేనే సంతకాలు కాదంటే నేరుగా అధికారులకు దగ్గర వెళితే కస్సు బస్సు ఇది ఆదోని ఆర్డబ్ల్యూఎస్‌ డీఈ కార్యాలయం పనితీరుకు నిదర్శనం. ఆ కార్యాలయంలో ప్రైవేట్‌ వ్యక్తులదే రాజ్యం. మధ్యవర్తులు చెప్పిందే వేదం అన్నట్లు అధికారులు ఫైళ్లు చక్కబెడుతుంటారు. అడిగినంత ముట్టజెపితే గంటల్లో పని, లేదంటే రోజుల తరబడి ప్రదక్షిణలు. కార్యాలయ విభాగాలపై పర్యవేక్షణ జరిపి అక్రమాలకు తావివ్వకుండా చూడాల్సిన ఉన్నతాధికారే ముడుపులకు అలవాటుపై స్థానికులు మండిపడుతున్నారు.

ఆదోని పట్టణంలో గ్రామీణా నీటి సరఫరా విభాగంలో కార్యాలయానికి పేరు కూడా ఉండదు. కార్యాలయంలో ఒక్క డిఈ సాంబయ్య, ముగ్గురు ఏఈలు విధులు నిర్వహిస్తున్నారు. వారు ఆదోని ఏఈ మధు కృష్ణ ఆచారి, కౌతాళం ఏఈ నాగమల్లయ్య, ఆస్పరి ఏఈ హనుమంతు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎఈకి ఒక ప్రైవేటు వ్యక్తి ఉండగా మరో వ్యక్తి కంప్యూటర్‌ ఆపరేటర్గా ప్రైవేట్‌ వ్యక్తే కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధికారులను కాదని ప్రైవేట్‌ వ్యక్తులు చెప్పిందే వేదంగా పనులు కొనసాగిస్తున్నారు. ఏ గ్రామంలో త్రాగునీటి సమస్యలు ఉన్న, లేదా పంచాయతీ నిధుల ద్వారా ఏదైనా పనులు చేపట్టాలన్న, టెండర్‌ ద్వారా కాంట్రాక్టు పనులు చేయాలన్న ప్రైవేట్‌ వ్యక్తులను కలవాల్సిందే. అలా కాదని నేరుగా అధికారులను సంప్రదిస్తే కస్సుబుస్సుని చిందులు వేస్తూ రోజులు తరబడి తిప్పిస్తున్నారని వివిధ గ్రామ ప్రజాప్రతినిధులు తెలిపారు. పనులు చేయాలన్న, బిల్లులు మంజూరు చేయాలన్న, అధికారులు సంతకాలు కావాలన్నా, అగ్రిమెంట్లు చేపించుకోవాలన్నా ముందుగా డిఈ పేరు చెప్పి 10 శాతం ఏఈ 5 శాతం పేర్లు చెప్పి వసూలు చేస్తున్నట్టు ఆరోపణాలు గుప్పుమంటున్నాయి.

పనికో రేటు…!
గ్రామీణా నీటి సరఫరా కార్యాలయంలో వారు ఆఫీస్‌ కు ఎలాంటి సంబంధాలు లేకున్నా వారికి ప్రత్యేక కుర్చీలు, టేబులు, బీరువాలు వీరిని చూస్తే నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అనుకోవాలి.కార్యాలయంలో పనికోరేటు ఫిక్స్‌ చేసినట్టు ప్రచారంలో ఉంది.చేర్పులు, మార్పులు జరగాలంటే రూ.2వేల నుంచి రూ.5వేల వరకు అప్పజెప్పాల్సి వస్తోంది. దీంతో సామాస్య ప్రజలు ఛాంబర్‌లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అదే తాను నియమించుకున్న ప్రైవేటు వ్యక్తులను తోడ్కొని వెళ్తే సమాధానం లభిస్తోందన్న ప్రచారం ఉంది. ప్రైవేట్‌ వ్యక్తులు ఏ సెక్షన్లలోనైనా సరే ఉద్యోగులతో సమానంగా కుర్చీల్లో తిష్టవేసి ఫైళ్లను లెక్కిస్తున్నారు. రికార్డు గదిలో వీరి హవా మితిమీరింది. అధికారుల అండదండతో ఫైళ్లను బయటకు తెచ్చి జిరాక్స్‌ తీయిస్తున్నారు. అక్కడ పనులు కావాలన్నా పచ్చ నోటు ఇచ్చుకోవాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, చోటామోటా లీడర్లకు పనులు జరుగుతున్న నేపథ్యంలో సదరు అధికారితీరుపై నోరు మొదపడం లేదని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలంలో యథేచ్చగా సాగుతున్న చేతివాటంపై విచారణ జరిపి శాఖాపర చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.

నేరుగా వెళ్తే పనికాదు !
కార్యాయాల్లో పనికావాలంటే పైరవీకారులు ఆశ్రయించనిదే పని కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయాల్లో వివిధ సమస్యలపై రైతులు, ప్రజలు నేరుగా వెళ్తే ఫైళ్లు ముందుకు కదలడం లేదు. పని కావాలంటే ఎవరో ఒకరు మధ్యవర్తిగా వెళ్లి చేయించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. పైరవీకారుల ద్వారా వస్తేనే అధికారులు వేగంగా పనులు చేస్తున్నారని, తాము నేరుగా వెళ్తే పనులు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

➡️