సుఖప్రసవాలకు భరోసా కల్పించాలి

Jun 9,2024 22:07

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: గిరిజన గర్భిణులు సుఖప్రసవాలకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం డిఒపిటి సభ్యులు మోలారు శామ్యూల్‌, సుదర్శన్‌ భగత్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రిజం- 10 ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన వీరు తమ పర్యటనలో భాగంగా ఆదివారం గుమ్మలక్ష్మీపురంలోని వైటీసీలో ఉంటున్న గిరిశిఖర గర్భిణుల వసతి గృహాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రిజం-10 అమలు ఆవశ్యకత, పురోగతి విధానాలను వివరించారు. గిరిజన గ్రామాల్లో రక్తహీనతతో బాధపడుతున్న పలువురు గిరిజన మహిళలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరి శిఖర గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తే సుఖప్రసవాలకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన గర్భిణులకు ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని అభినందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా 10 ఏళ్లలోపు వయసు కలిగిన చిన్నారులు పౌష్టికాహార లోపంతో మృత్యువాత పడకూడదన్నారు. అనంతరం ఈ బృందం సభ్యులు వైటిసిలో గిరిజన గర్భిణులకు వండుతున్న ఆహార పదార్థాలను రుచి చూసి మరింత మెరుగైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించి స్టాక్‌ రూమును పరిశీలించారు. అనంతరం మండ, రేగిడి గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో భద్రగిరి, కురుపాం ఐసిడిఎస్‌ సిడిపిఒలు సిహెచ్‌. సుశీల దేవి, కె.విజరు గౌరి తదితరులు పాల్గొన్నారు.

➡️