సహారా డిపాజిట్‌ చెల్లింపుపై ప్రకటన చేయాలి : సహారా ఇండియా బాధితుల సంఘం

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : సహారా ఇండియా ఖాతాదారులు డిపాజిట్‌ సొమ్ము చెల్లింపుపై విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రకటన చేయాలని సహారా ఇండియా బాధితుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మిదాసు, జిల్లా కమిటీ సభ్యులు పి.ధనంజరు నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ఖాతాదారులు సహారాలో రూ.84వేల కోట్లు డిపాజిట్‌ చేశారని, వారికి వడ్డీతో రూ.3లక్షల కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చెల్లించడం లేదన్నారు. రాష్ట్రంలో కోటి మంది ఖాతాదారులు నుంచి 80వేల మంది ఏజెంట్లతో రూ.25వేల కోట్లు డిపాజిట్లు సేకరించామని, ఆయా సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో ఖాతాదారులు తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఒత్తిడితో రాష్ట్రంలో 7800మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహారా యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శించారు. విశాఖ వస్తున్న మోడీ సహారా డిపాజిట్‌ సొమ్ము చెల్లింపుపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బాధితుల సంఘం నాయకులు ఎస్‌.నర్సింహనాయుడు, టి.పాపారావు, జి.నాగరాజు, పి.తిరుపతి పాల్గొన్నారు.

➡️