ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు నగరపాలక సంస్థ మేయర్‌గా కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 15న రాజీనామా చేసిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలాను ఇన్‌ఛార్జి మేయర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి ఆమె మేయర్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, టిడిపి పక్ష నాయకుడు కోవెలమూడి రవీంద్ర ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సజీలా మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో మౌలిక వసతులైన పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలతోపాటు అభివృద్ధి పనులను ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో చేపడతామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటాన్న ఆమె తనకు మేయర్‌గా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ ఇన్‌ఛార్జి మేయర్‌కు అధికారుల పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రెగ్యులర్ మేయర్ ఎన్నికకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 25న గత మేయర్ రాజీనామా ఆమోదం కోసం అత్యవసర సమావేశం జరుగుతుందని తెలిపారు. దీనిపై కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చామని, సమావేశానికి ఇన్‌ఛార్జి మేయర్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. సజీలాకు ఎపిఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్, ఎల్‌ఐడిసి చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఎపిటిఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
