ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు

May 27,2024 21:51

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన పట్టివేత

సీజ్‌ చేసిన విద్యాశాఖ అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న నారాయణ, చైతన్య పాఠశాలల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె.రవికుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యార్థులను నిలువు దోపిడీ చేయడానికి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు పుస్తకాల అమ్మకం చేపడుతున్నాయని అన్నారు. విద్యార్థులు , తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చైతన్య, నారాయణ పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్న రూముల్ని గుర్తించామని తెలిపారు. ఇప్పటికే ట్యూషన్‌ ఫీజుల రూపంలో 40 నుంచి 60 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ పాఠశాలలో ఇప్పుడు పుస్తకాలు, యూనిఫాంల రూపంలో అదనంగా మరో 20 వేల రూపాయలు వరకు వసూలు చేస్తున్నాయని తెలిపారు. తక్షణమే ఇలా జిల్లా వ్యాప్తంగా పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్‌ పాఠశాలలను సీజ్‌ చేయాలని, వాటి లైసెన్స్‌ లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని పుస్తకాల అమ్మకాన్ని ఆపాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇదేవిధంగా పాఠశాలల పుస్తకాలను అమ్ముతున్న రూములను సీజ్‌ చేయించి పాఠశాలల లైసెన్సులు రద్దు చేసేలా పోరాడుతామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ డిఇఒ కెవి రమణ అక్కడికి వచ్చి చైతన్య , నారాయణ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న రూమ్‌లను సీజ్‌ చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కె.రాజు, పి. రమేష్‌, జిల్లానాయకులు డి.వెంకటరమణ, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️