ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : సమీరా వచ్చేస్తున్నా..ఇంకో 15 నిమిషాల్లో నీ ముందుంటా..నువ్వేం కంగారు పడకు. బాబు తిన్నాడా..! నువ్వూ భోజనం చేసి పడుకో..’ఐ యామ్ ఆన్ ది వే’ అన్న భర్త తెల్లారే సరికి విగత జీవిగా దర్శనమిచ్చాడు. కట్టుకున్న భార్యకు పుట్టెడు దు:ఖాన్ని మిగిల్చాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం రామానాయుడు ఎస్టీ కాలనీ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి పోతే..బుచ్చినాయుడుకండ్రిగ మండలం జోగికండ్రిగకు చెందిన కొప్పల ధర్మయ్య కుమారుడు కొప్పల నారాయణ(25). డిగ్రీ వరకు చదివి రౌతు సూరమాల సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నారాయణకు పెళ్ళకూరు మండలం నెలబల్లి దళిత వాడకు చెందిన సమీరాతో ఏడాదిన్నర కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భార్య సమీరా కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఆమెను చూసేందుకు నారాయణ రెండు రోజుల కిందట నెలబల్లి వెళ్లాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తి పట్టణానికి వెళ్ళాడు. తిరిగి వస్తూ తన మేనత్త ఊరైన తాటిపర్తికి చేరుకున్నాడు. రాత్రి పదవుతున్నా నారాయణ ఇంటికి రాకపోవడంతో సమీరా భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడున్నావంటూ ఆరా తీయడంతో తాటిపర్తిలో ఉన్నాననీ, మరో 15 నిమిషాల్లో మీ ముందుంటాననీ, కంగారు పడొద్దని నారాయణ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో నెలబల్లికి వెళ్తుండగా మార్గ మధ్యలో నాయుడు పేట-మదనపల్లి జాతీయ రహదారికి అతి సమీపంలో రామానాయుడు ఎస్టి కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బండ రాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నారాయణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బండరాయిని ఢీకొట్టిన సమయంలో నారాయణ బైక్ తోపాటు ముళ్లపొదల్లో పడిపోవడంతో అటుగా వెళ్లిన వాహనదారులకెవరికి కనిపించని పరిస్థితి. ఇప్పుడే వస్తున్నానన్న భర్త తెల్లారైనా ఇంటికి చేరకపోవడంతో సమీరా తాటిపర్తిలోని తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఆరా తీయగా ముళ్లపొదల్లో విగత జీవిగా పడి ఉంటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. సమాచారం అందుకున్న తొట్టంబేడు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు.