మెట్టగుడ గ్రామంలో పాఠశాలను మంజూరు చేయండి : లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌

ముంచంగిపుట్టు (అల్లూరి) : మెట్టగుడ గ్రామంలో పాఠశాలను మంజూరు చేయాలంటూ … లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సర్పంచ్‌ త్రినాథ్‌ మాట్లాడుతూ … అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయితీ మెట్టగుడలో పాఠశాల లేకపోవడంతో 14 మంది విద్యార్థులు రెండు వైపులా మూడు కిలో మీటర్లు దూరంలో ఉన్న లక్ష్మీపురం ఎంపిపి పాఠశాలలో కాలినడకన గాటీ రహదారిలో వెళ్లి చదువుతున్నారని చెప్పారు. ఈ గ్రామాల మధ్య పెద్ద గెడ్డ ఉందని, వర్షాకాలంలో ఆ గెడ్డను దాటాలంటే కష్టంగా ఉంటుందని అన్నారు. మెట్టగుడలో పాఠశాలను మంజూరు చేయాలని గతంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పని చేసిన శ్రీ వినరు చంద్‌కి వినతి పత్రం అందజేస్తే స్పందించిన పి ఓ ఒక సంవత్సరం పాటు తాత్కాలింగా పాఠశాల ఏర్పాటు చేశారని తెలిపారు. దాన్ని కొనసాగించి ఉంటే ఈ విద్యార్థులకు ఇన్ని కష్టాలు ఉండేవి కావన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయంలో కూడా పాఠశాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ స్పందనలో వినతి పత్రం అందజేసినప్పటికీ స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొత్త ప్రభుత్వం అయిన విద్యార్థుల కష్టాన్ని గుర్తించి మెట్టగూడ గ్రామాంలో పాఠశాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై రాతపూర్వకంగా మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తానని అన్నారు.

➡️