ప్రజాశక్తి-మార్కాపురం: ఉచిత ఇసుక సరఫరా హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఇసుక అందుబాటులో లేని కార ణంగా భవన నిర్మాణ రంగంలో వివిధ విభాగాల్లోని కార్మికులు ఉపాధి కోల్పోయారని సిపిఎం మార్కాపురం పట్టణ కార్యదర్శి డి.సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఇసుక కోసం ఎందాకైనా పోరాడుతామని ఆయన హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని స్థానిక గడి యారం స్తంభం సెంటరులో గురువారం ధర్నా చేప ట్టారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ఇసుక అందని ద్రాక్ష లాగా తయారైందన్నారు. డబ్బుంటే బంగా రమైనా కొనుక్కోవచ్చు గానీ ఇసుక కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు, సంబంధిత ఉప కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని హామీ ఇచ్చి 120 రోజులైనా కూడా ఉచిత ఇసుక హామీ అమలు జరగకపోగా, రూ.1100 టన్ను ఇసుక గతంలో ఉండగా ప్రస్తుతం రూ. 2500 వరకు ధర పలుకుతోందన్నారు. అంత ధర పెట్టి కొందామన్నా ఇసుక అందుబాటులో లేదన్నారు. ఇసుక లేని కారణంగా భవన నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికుల ఉపాధిపైన తీవ్రమైన ప్రభావం పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీల పేరుతో కాలయాపన చేస్తుందని, వెంటనే ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేలాగా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించి, రకాల బీమా సౌకర్యాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భవనిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పిన సిఎం చంద్రబాబు ఆ హామీ నేటికీ నెరవేరలేదని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో లభించే ఇసుకను ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు అమ్మడం, నల్లబజారులో అధికార పార్టీ నాయకులు అమ్ముకుంటూ, రూ. కోట్లు దండుకుంటున్నారనే చర్చ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. ఇసుక అక్రమ తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని, ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మార్కాపురం మండల కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, సిపిఎం నాయకులు డీకేఎం రఫీ, జవ్వాజి రాజు, జె.నాగరాజు, షేక్ నన్నేసా, షేక్ కరిముల్లా, ఏనుగుల సురేష్ కుమార్, ముఠామేస్త్రిలు శివారెడ్డి, వెంకటరెడ్డి, కాశిరెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు పిల్లి ప్రసాద్, షేక్ కరీముల్లా, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
