కోవూరు సుగర్ ఫ్యాక్టరీ నుంచి ఇసుక తరలిస్తున్న దృశ్యం
ఇసుక మాఫియా మాయాజాలం..!
ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి వైఎస్‌ఆర్‌పి ప్రభుత్వం గతంలో ఇసుక విషయంలో సామాన్య ప్రజలు, వినియో గదారులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. అప్పటి నాయకులు ఇసుకపై కోట్లు దోపిడీ చేశారనే పేరు తెచ్చుకున్నారు. ఉచితంగా వచ్చే ఇసుకను అమ్మకానికి పెట్టి భవన నిర్మాణ దారులు, కార్మికుల కడుపుకొట్టారని, అప్పట్లో టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలకు ఇసుక అమ్మకాలు కట్టబెట్టడంతో జిల్లాలో డంపింగ్ యార్డ్‌లు వచ్చాయి. జిల్లాలో మర్రిపాడు, మినగల్లు, పల్లిపాడు, వెంకటాచలం, కావలి ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్‌లు ఏర్పాటు చేశారు. పెన్నా నది నుంచి ఇక్కడకు ఇసుక తరలించి, అక్కడ నుంచి వినియోగదారులకు అమ్మేవారు. ట్రాక్టర్ రూ.5 వేలు, టిప్పర్ రూ.18 వేల వరకు ధర పలికింది. ఇది అప్పట్లో భవన నిర్మాణ యజమానులకు మోయలేని భారం.. ప్రభుత్వం మారితేనైనా ఇసుక కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. చంద్రబాబునాయుడు మళ్లీ వస్తే కష్టాలు తీరుతాయని ఆశపడ్డారు. జూన్ 4న ఫలితాల్లో టిడిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారడంతో ఇసుక ఉచితంగా వస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సందెట్లో సడేమియా అన్నట్లు టిడిపి నేతలు డంపింగ్ యార్డ్‌ల్లో ఉన్న ఇసుకను ఎప్పుడో తరలించారు. ఈ విషయం తెలిసి స్వ యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక జోలికి నాయకులు ఎవరూ వెళ్లవద్దని ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశిం చినా అధికారపార్టీ నేతల అక్రమాలు, దోపిడీ ఆగడం లేదు. గత ప్రభుత్వంలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన నేతలు, ఇసుక మాఫియా ఇప్పుడు టిడిపిలో వచ్చి చేరిందనే విమర్శలున్నాయి. ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరు కన్నా ఈ ప్రభుత్వానికి ఎక్కువ చెడ్డపేరు వస్తుందని తెలుస్తోంది. టిడిపి అధినేతలు సైతం ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టలేని స్థితికి చేరుకున్నారని సమాచారం. బుకింగ్..సరఫరా అంతా వారే..!ఇసుక ప్రస్తుతం సంగం, మినగల్లు, నెల్లూరు, పోతిరెడ్డిపాళెం, పల్లెపాడు ప్రాంతాల్లో ఇసుక నిల్వలున్నాయి. ఇక్కడ నుంచి ఇసుక కావాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలి. తరువాత క్రమ పద్ధతిలో క్యూలో వచ్చి లారీ, టిప్పర్లలో ఇసుక తీసుకెళ్లాలి. ఆన్‌లైన్ బుకింగ్ అంతా ఇసుక మాఫియా చేతిలోకి వెళ్లిందని తెలుస్తోంది. వారానికోసారి ఆన్‌లైన్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సమయంలో ఇసుక మాఫియా ఆధార్‌కార్డులు తీసుకొని బుకింగ్ చేసుకుంటున్నారు.సామాన్యులు కంప్యూటర్ సెంటర్‌లో కూర్చొని బుకింగ్ కావడం లేదు. మళ్లీ వారం వేచిచూడాల్సిందే. టన్ను రూ.350 చొప్పున ఒక ట్రాక్టర్‌కు 4.5 టన్నులు చొప్పున రూ.1750 అవుతోంది. రవాణా మరో వెయ్యి కలిపితే సుమారు మూడు వేల రూపాయలకు ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరాలి. ఇసుక మాఫియా బ్లాక్‌చేసి ట్రాక్టర్ రూ.5500 వరకు అమ్ముతున్నారని తెలుస్తోంది. టిప్పర్‌కు 20 నుంచి 24 టన్నుల వరకు లోడింగ్ చేస్తుండగా ప్రభుత్వానికి రూ.7 వేలు చెల్లించాలి. రవాణా మరో మూడు, నాలుగు వేల రూపాయలు అవుతోంది. బ్లాక్‌లో రూ.36 వేల వరకు అమ్ముతు న్నారనే విమర్శలు వస్తున్నాయి.బుకింగ్ విషయం లోనూ, రవాణా విషయంలో వినియోగదారుల ప్రమేయం ఉండడం లేదు. ఇసుక మాఫియా బ్లాక్ చేసి, భారీగా దోపిడీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులకు తెలిసినా అధికారపార్టీ నేతల వత్తిడి, మాఫియాతో నోరు మెదపడం లేదు. ఇసుక గత ప్రభుత్వంలోనే బాగుందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం స్పందించకుంటే ఇసుక చెడ్డపేరు ప్రభుత్వానికి చుట్టుకుంటుందని తెలుస్తోంది.