ప్రజాశక్తి-అనకాపల్లి
ఇసుక తవ్వకాలకు చైర్మన్‌గా కలెక్టర్ ఉన్న నేపథ్యంలో సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌కు టిడిపి బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ల సురేంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా విజయ కృష్ణన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ జిల్లా అధికారులు గత ప్రభుత్వంలో ఇసుకపై వ్యాపార సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకొని, ఇతర రాష్ట్రాలకు తరలించి సామాన్య ప్రజలకు ఇసుక అందకుండా చేశారని తెలిపారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ కచ్చితంగా విధి విధానాల ప్రకారంగా ఇల్లు కట్టుకునే ప్రతి సామాన్యుడికి ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకలను పర్యావరణహితంగా చేసే విధంగా మట్టి వినాయకుడినే పూజించేలా అధికారులచే ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.