ప్రజాశక్తి – ఆరిలోవ : ముడసర్లోవ కొత్త రోడ్డులో ఇసుక నిల్వ కేంద్రం సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. విశాఖలో ఇసుక రీచ్ కేంద్రాలు లేనందున ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించిన విషయం విధితమే. దీనిలో భాగంగా ముడసర్లోవ కొత్త రోడ్డులో డంపింగ్ యార్డు సమీపంలోని సోలార్ విద్యుత్ ప్లాంట్ ఎదురుగా ఖాళీ స్థలంలో నన్నపనేని ఎర్త్ మోర్స్ ప్రయివేటు ఎజెన్సీకి ఈ కేంద్రాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఇసుక కేంద్రంలో శ్రీకాకుళం ఇసుక రీచ్‌ల నుంచి తీసుకొచ్చిన సుమారు 75 టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. టన్ను ఇసుక ధర రూ.700గా నిర్ణయించారు. అవసరమైన వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ ఇసుకను పొందవచ్చని పేర్కొన్నారు. లేకుంటే ఇసుక కేంద్రం వద్దకే తమ ఆధార్ కార్డు తీసుకు వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 8309186417, 6300805838 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
