రైతు బజారులో పడకేసిన పారిశుధ్యం

May 28,2024 17:04 #farmers market, #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు వెంకటరమణ కాలనీ సమీపంలో అమీన్ అబ్బాస్ నగర్ రైతు బజారులో మురికి కాలువ శుభ్రం చేయక , చెత్త పేరుకొని పోయి భరించలేని దుర్వాసనవస్తుంది. రైతు బజార్ కు చెందిన భవనంలో అడుగు తీసి అడుగుపెట్టే పరిస్థితి లేదు. నిత్యవసర సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు పళ్ళు కొనేందుకు వచ్చిన వందలాది మంది దుర్వాసనతో ముక్కు మూసుకొని తిరగాల్సిన పరిస్థితి దాపరించిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని. పుల్లారెడ్డి, నగర నాయకులు వి .విజయ్, ఏ. వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు పి పి ఎస్ ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం అమీన్ అబ్బాస్ నగర్లో ఉండే రైతు బజార్లో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రైతు బజార్ కోసం కేటాయించారన్నారు. కానీ రైతు బజార్ నిర్వహణను సంబంధిత అధికారులు గాలికి వదిలేశారని విమర్శించారు. నిత్యవసర సరుకులు, ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు అమ్ముకునే వారి దగ్గర క్రమం తప్పకుండా బాడిగలు వసూలు చేసుకుంటూ కనీసం పారుశుద్ధాన్ని మెరుగుపరచాలని స్పృహ కూడా లేదన్నారు. వెంటనే పారిశుద్ధ్యన్ని మెరుగుపరుస్తామని సెలవులో ఉన్న ఈవో జయమ్మ ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు. పర్యటనలో పాల్గొన్న ప్రతినిధి బృందంలో పి పి ఎస్ ఎస్ నగర నాయకులు కె. శ్రీనివాసులు, సి.వి .వర్మ, ఎస్. జాకీర్,కె. వెంకట్ రాముడు తదితరులు పాల్గొన్నారు.

➡️