రాజధానిలో పారిశుధ్య కార్మికుల భిక్షాటన

Apr 11,2025 17:21 #guntur, #workers

ప్రజాశక్తి – తుళ్లూరు : పెండింగ్ జీతం చెల్లించండి మహాప్రభో.. అంటూ ప్రభుత్వానికి, అధికారులకు ఎన్ని విన్నపాలు చేసినా, నిరసన తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో రాజధాని అమరావతి లోని పారిశుధ్య కార్మికులు చేసేదిలేక శుక్రవారం భిక్షాటన చేశారు.ఇప్పటికైనా జీతాలు చెల్లించమంటూ స్థానిక గ్రంధాలయం సెంటర్ నుంచి సి ఆర్ డి ఎ ప్రాంతీయ కార్యాలయం వరకు ఆకలియాత్ర జరిపారు. పారిశుధ్య విధులు నిర్వర్తించే కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం సరైంది కాదంటూ గ్రామస్తులు కార్మికులకు మద్దతు పలికారు. కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కార్మికులు భిక్షాటన అనంతరం సి ఆర్ డి ఎ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసేందుకు ధరఖాస్తు ఫారం ఇవ్వాలని కోరగా అధికారులు తటపటాయించారు. ఒంటి గంట  వరకు గ్రీవెన్స్ నిర్వహించాల్చి ఉండగా మధ్యాహ్నం  12 గంటలకే ముగిసిందంటూ చెప్పారు. దీంతో కార్మికులు నిరసన తెలపడంతో అధికారులు దరఖాస్తు ఫారం అందజేశారు. దీంతో కార్మికులు, రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి అధికారులకు మరోసారి వినతిపత్రం అందజేశారు. కార్మికుల ఆందోళనతో అధికారులు స్పందించారు. శుక్రవారం మీ పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు ఫిబ్రవరి, మార్చి నెల జీతాలు ఇవ్వలేదని, ఏప్రియల్ నెల గడుస్తున్నా ఎలాంటి స్పందనా లేకపోవడంతో గత్యంతరం లేక రోడ్డున పడి భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల ఆకలి యాత్ర, భిక్షాటనకు ప్రజలు స్పందించి ఆర్థిక సహాయం చేయడమే గాక, ఇన్నాళ్లు జీతాలు ఇవ్వకపోతే పారిశుద్ధ్య కార్మికులు పనులు ఎలా చేస్తారంటూ మద్దతు తెలిపారని అన్నారు. జీతాలు చెల్లించమని కోరుతూ అధికారులకు పదేపదే అర్జీలు అందజేసినప్పటికీ అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో అనివార్యంగా మండు టెండలో పారిశుద్ధ్య వీధుల్లో ఆకలి యాత్ర నిర్వహించి, భిక్షాటన చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.ఆకలియాత్ర, భిక్షాటనకు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యపు వైఖరే కారణమన్నారు.
ఇచ్చిన హామీ మేరకు జీతం వెంటనే చెల్లించకపోతే విజయవాడలో కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి భిక్షాటన చేపడతామని రవి హెచ్చరించారు.పెండింగ్ జీతాల చెల్లింపుతో పాటు రాజధాని పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న విధంగా రూ. 21 వేలు జీతం ఇవ్వాలని, నిలిపివేసిన రాజధాని సామాజిక పెన్షన్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు ఎల్
సుఖవేణి, ఎన్ వీర్లంకమ్మ,శివపార్వతి, టి బుజ్జి, ఎం మేరి, లక్ష్మీ తిరుపతమ్మ, కోటేశ్వరరావు,రజని తదితరులు పాల్గొన్నారు.

➡️