నెహ్రూ నికేతన్‌ లో సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : స్థానిక బోస్‌ రోడ్డులోని నెహ్రూ నికేతన్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను శనివారం నిర్వహించారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి కాంత్‌ దాసరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గీతా కాంత్‌ పర్యవేక్షణలో జరిగిన వేడుకలలో ఇస్కాన్‌ టెంపుల్‌ ఇంచార్జి సింహ గౌరదాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబరాన్నంటిన సంబరాలలో విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణ తో ఆకట్టుకున్నారు. రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. సోదిమ్మ వేషధారణలో తొమ్మిదో తరగతి విద్యార్థిని సీతామహాలక్ష్మి విద్యార్థుల మధ్య సందడి చేశారు. రైతులు పండించిన పంటలను ఇంటికి తీసుకు వస్తున్నట్లు కొందరు విద్యార్థులు నటించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నెహ్రూ నీకేతన్‌ విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి ప్రకాశరావు, రంగ లక్ష్మి దంపతులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ దాస్‌ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు వివిధ రకాల పండగలు, ఆచార్య వ్యవహారాలు పాఠశాల వాతావరణంలో నిర్వహించటం అభినందనీయమన్నారు. మురళి కాంత్‌ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️