ప్రజాశక్తి- మేదరమెట్ల : మండల పరిధిలోని రావినూతల గ్రామంలో రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భ్రమరా టౌన్‌షిప్ వారి ఆర్థికసహకారంతో 31వ అంతర్‌రాష్ట్ర సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ గ్రామస్తులు అసోసియేషన్‌గా ఏర్పడి స్టేడియాన్ని నిర్మించుకొని క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారని తెలిపారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రఘు బాబు మాట్లాడుతూ తమ గ్రామంలో ఇంతటి స్టేడియం ఉండటంతో సంతోషంగా ఉందన్నారు. విజేతలకు రూ.1116 నుంచి ఆరు లక్షల ప్రైజ్ ఇచ్చే వరకూ ఎదగటం, వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఇచ్చి ఇక్కడ ఆడటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తొలుత శ్రీ భ్రమరా టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ గళ్ళ రామచంద్ర రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడా కారులను పరిచయం చేసుకున్నారు. నూకసాని బాలాజీ ,గళ్ళ రామచంద్రరావు, సినీ నటుడు ఎర్ర రఘుబాబు కొద్ది సేపు బ్యాటింగ్ చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బాధర బాడ్మింటన్ సమాఖ్య మాజీ కార్యదర్శి, గ్రామవాసి మువ్వా తిలక్, అద్దంకి రూరల్ సిఐ డి. మల్లికార్జునరావు, మస్తాన్‌రావు, చిన్నపాటి హరిబాబు, మేదరమెట్ల శ్రీనివాసరావు, అసోసియేషన్ సభ్యులు చేబ్రోలు నరసింహా రావు, శ్రీనివాస రావు, ఆర్‌ఎస్‌సిఎ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జట్టు బోణి సంక్రాంతి కప్ టోర్నమెంట్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఎస్‌పిఎఆర్‌ఎ టిఎఎన్‌వారియర్ 11 తిరుపతి వర్సెస్ జిడిసిఎ గుంటూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని తిరుపతి జట్టును బ్యాటింగ్ ఆహ్వానించింది .తిరుపతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులను చేసి తొమ్మిది వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన గుంటూరు జట్టు 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుంటూరు జట్టు క్రీడా కారుడడు 42 బంతులు ఆడి 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో మహిదీప్ 49 పరుగులు సాధించాడు. కెపి.సాయి రాహుల్ కేవలం 18 బంతుల్లో 2 సిక్స్‌లతో 2 ఫోర్లతో 32 పరుగులు సాధించి జట్టు విజయాన్ని ఖరారు చేసాడు. రాహుల్ బౌలింగ్ లో కూడా రాణించి నాలుగు ఓవర్లలో 41 పరుగు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తిరుపతి జట్టుకు చెందిన వాట్సన్ 3.2 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు . ఈ మ్యాచ్‌కు ఎంపైర్లుగా శ్రీనివాసరావు ,రాజు వ్యవహరించారు.నేటి మ్యాచ్‌లు ఇవే..నెక్స్ట్ గెన్ లెవెన్ హైదరాబాద్ వర్సెస్ మస్తాన్ లెవెన్ మార్టూరు జట్ల మధ్య తొలిమ్యాచ్ జరగనుంది. రెండో ఎంఆర్‌సిసి 11 చెన్నై వర్సెస్ సికింద్రాబాద్ రైల్వే జట్ల మధ్య జరగనుంది.