ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం గ్రామంలో సంక్రాంతి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, రైతు సంఘం నాయకులు పాల్పూరి సత్యనారాయణ, మహిళా సంఘం నాయకురాలు బంకురు యశోద, పాల్పూరి సత్యవతి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు వారి పండుగని, వ్యవసాయ పండుగని, ఈ పండగల పేరుతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ విధమైన ఆటలు పోటీలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఒకపక్కన విష సంస్కృతి ప్రబలుతుందని, కోట్లాది రూపాయలు కోడిపందాలు పేరుతో పోగొట్టుకుని సుఖసంతోషాలతో గడపాల్సిన జీవితాన్ని దుఃఖంతో గడుపుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయని, అలాంటి కోడిపందాలకు దూరంగా ఉంచడం కోసం ఇలాంటి ఆటల పోటీలు దోహదపడుతున్నాయని వారు తెలిపారు. ఇలాంటి ఆటలు పోటీలకి గ్రామంలోని పెద్దలు సహకరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్త్రీలకు జరిగిన ముగ్గుల పోటీలు మొదటి బహుమతి ఎన్.గాయత్రి, రెండవ బహుమతి వి.రామలక్ష్మి, మూడో బహుమతి బి.ఉమా శాంతి గెలుపొందారని, అలాగే కుర్చీలాటలో ఎన్. గంగాభవాని టి.విశాలాక్షి ప్రధమ ద్వితీయ బహుమతులు గెలిచారన్నారు. జూనియర్స్ లో ఉమా శాంతకుమారి, జి. దీక్షిత, బాలురలో కొల్లి వినోద్, విజయప్రసన్న కుమార్, పరుగుపందెంలో వినోదు, నిఖిల్, బాలికల్లో వల్లి ఉమా, లెమన్ స్పూన్ ఆటలో ఉమా శాంత్ కుమారి, వర్షిత గెలుపొందారు. గెలిచిన విజేతలకు గ్రామ సర్పంచి మద్దుకూరి గంగాభవాని, తెలుగుదేశం నాయకులు మాజీ ఉపసర్పంచ్ మద్దుకూరి ధనరాజు, బత్తుల రాంబాబు మెడికల్స్, జనసేన నాయకులు బండి శ్రీనివాస్, పంగిడి రాంబాబుల చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కండెల్లి రమేష్, ఆర్ అనూష, బంకురు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
