ఫిర్యాదులకోసం టోల్‌ఫ్రీ నెంబరు 14405
కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ప్రజాశక్తి-విజయనగరంకోట : సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరు 14405కు విస్తత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎపి ప్రభుత్వ ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తమ గ్రామంలో ఎక్కడా సారా తయారీ గానీ, వినియోగం గానీ జరగడం లేదని అన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలను తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత, ఇప్పటికే సారా తయారీ, వినియోగం జరుగుతున్నట్లు గుర్తించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అబ్కారీ శాఖతోపాటు పోలీసులు, అటవీశాఖ కూడా నాటు సారా తయారీపై నిఘా పెంచాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఎక్కడైనా సారా తయారీ జరిగితే, దానికి అటవీశాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. అటవీ, పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సారా తయారీదార్లపై ఉన్న కఠిన శిక్షలు, వినియోగించే వారికి కలిగే అనర్ధాలను వివరిస్తూ గ్రామస్థాయిలో విస్తత ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. విద్యార్ధులను అవగాహన కలిగించి, వారి ద్వారా తల్లితండ్రులకు చైతన్యం కలిగించాలని చెప్పారు. జిల్లాను సారా రహితంగా మార్చడంలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం నవోదయం 2.0 కు సంబంధించిన గోడపత్రికలను, స్టిక్కర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రచార రథాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఎక్సైజ్ సహాయ కమిషనర్ పి.రామచంద్రరావు మాట్లాడుతూ, జిల్లాలో నవోదయం కార్యక్రమం అమలు, నాటుసారా తయారీ తదితర అంశాలను వివరించారు. సమావేశంలో ఇన్‌ఛార్జి జెసి ఎస్.శ్రీనివాసమూర్తి, ఎక్సైజ్ సూపరింటిండెంట్ బి.శ్రీనాధుడు, అటవీశాఖాధికారి కొండలరావు, డిఇఒ మాణిక్యంనాయుడు, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ ఎస్.జీవనరాణి, డిఆర్‌డిఎ ఎపిడి సావిత్రి, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.