దేశంలోని ఆర్టీసీలను కాపాడండి!

Mar 14,2025 16:29 #CITU

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : ఆర్టీసీలు నేరుగా విద్యుత్ బస్సులను నిర్వహించుకునే అవకాశం, బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ప్రైవేటు విద్యుత్ బస్సుల కన్సార్టియంల పేరుతో ఆర్టీసీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మార్చి 24న చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్,  ఆంధ్రప్రదేశ్ ఏఐఆర్టి డబ్ల్యు ఎఫ్ పిలుపునిచ్చాయనీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జె.దివాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కార్మిక కర్షక భవన్లో జరిగిన ఎస్ .డబ్ల్యూ. ఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జె. దివాకర్ హాజరై మాట్లాడుతూ… ఛలో ఢిల్లీ కోసం ఇప్పటికే వివిధ జిల్లాల నుండి రిజర్వేషన్లు చేసుకున్నారు. దేశంలోని వివిధ ఆర్టీసీల నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగ కార్మికులు చలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి హాజరవుతున్నారు. మన రాష్ట్రంలో విద్యుత్ బస్సుల పాలసీని 2018లో ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం తిరిగి దానిని 2024 డిసెంబర్ 11న పునరుద్ధరించింది. 2029 నాటికి మొత్తం ఆర్టీసీలో విద్యుత్ బస్సులతో నింపాలని సుస్థిర విద్యుత్ వాహనాల పాలసీ -4 లో లక్ష్యంగా పెట్టారు. ఇది ఏపీఎస్ఆర్టీసీకి అశనిపాతము వంటిది. ఆర్టీసీ యాజమాన్యం కూడా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతామని పదేపదే పత్రికలలో ప్రకటనలు చేస్తున్నారు. విద్యుత్ బస్సుల పేరుతో మొత్తం ఏపీఎస్ఆర్టీసీ మహా సంస్థను ప్రైవేటు కార్పొరేటర్లకు అప్పజెప్పాలని నిర్ణయించవద్దని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు ఆర్టీసీల విస్తరణకు పెను ప్రమాదంగా దాపురించాయి. ఆర్టీసీ బస్సులు స్థానంలో దేశవ్యాప్తంగా విద్యుత్తు బస్సులను తీసుకొని భవిష్యత్తులో ఆర్టీసీలను కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వ పథకము వేసింది. ఇటీవల కేంద్రము ప్రవేశపెట్టిన పీఎం- ఈ బస్సు స్కీము కూడా ఇందులో భాగమే. ఆర్టీసీ అధికారులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతో
దపదపాలుగా చర్చలు జరిపారు. మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని సంవత్సరాలు తరబడి పోరాడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలని లేదా అమ్మి వేయాలని లక్ష్యంతో కేంద్రం ఉన్నది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఎం.వి సవరణ చట్టం ఆర్టీసీలకు రవాణా రంగానికి పెను ప్రమాదం. లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ పర్మిట్,కొత్త మోటార్ వాహన చట్టం స్క్రాపింగ్ పాలసీ వంటి అంశాలు ఆర్టీసీలు పాలిట ప్రమాదంగా దాపురించాయి. వీటికి తోడు విద్యుత్ బస్సులు పేరుతో ఆర్టీసీ బస్సుల తొలగింపు ప్రమాదం ముందుకు వచ్చింది. ఈ విద్యుత్ బస్సుల ముసుగులో ప్రైవేటీకరణకు నిర్దేశించిన కాల పరిమితి కూడా నాలుగైదు సంవత్సరాలు మాత్రమే.
ఆర్టీసీ బస్ స్టేషన్ల స్థలాల ను కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నగదీకరణ ప్రాజెక్టులో చేర్చారు. నీతి ఆయోగు వంటి సంస్థ వీటికి పథకం రూపొందించింది. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలి.
జనవరి 8 -9 తేదీలలో విజయవాడలో జరిగిన ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రస్తుతము రవాణా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, కార్మికుల సమస్యలపై వివరంగా చర్చించింది.
మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన తో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది. ఈ లోపుగా వివిధ రాష్ట్రాలలో వాహన జాతాలు జరపాలని, రవాణా కార్మికులతో సభలు సమావేశాలు గేట్ మీటింగ్లు నిర్వహించాలని పిలుపునిచ్చింది. లక్షలాది కరపత్రాలతో, బుక్లెట్లతో క్యాంపై నిర్వహించాలని ఏ ఐ ఆర్ టి డబ్ల్యూ ఎఫ్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే
విద్యుత్ బస్సుల అంశంపై ఒక బుక్లెట్ ను ప్రచురించాము.
దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలసీలు ప్రకటించాయి. ఈ పాలసీలు ఆర్టీసీల ప్రైవేటీకరణను వేగం చేసేవి. ఇప్పటికే తమిళనాడులో ఆర్టీసీ కార్మికులు ఈ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. మన పక్క రాష్ట్రము తెలంగాణలో కూడా ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున జనవరి 7వ తేదీన విజయవాడలో విద్యుత్ బస్సులు ప్రైవేటీకరణ అంశంపై సదస్సు జరిపాము. జనవరి 24న డిపో జిల్లా కేంద్రాలలో గేట్ మీటింగ్లు నిరసన కార్యక్రమాలు జరిపాము. బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. వివిధ జిల్లా కేంద్రాలలో విద్యుత్ బస్సులపై సదస్సులు పెట్టడానికి ఎస్ డబ్ల్యూ ఎఫ్ కమిటీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈపాటికే తిరుపతి ,ప్రకాశం జిల్లాలలో సదస్సులు జరిగాయి. పార్లమెంటు సభ్యులు,శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్లు, వివిధ ప్రజాప్రతినిధులకు విద్యుత్ బస్సుల సమస్యలపై మెమోరాండంలో ఇచ్చి ప్రాతినిధ్యం చేయాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అనేక జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఏపీఎస్ఆర్టీసీలోని కార్మిక సంఘాలు, అసోసియేషన్లు ఈ సమస్యలపై స్పందించాలని ఆర్టీసీ కార్మికులు వారిపై ఒత్తిడి చేయాలి. ఏపీఎస్ఆర్టీసీ లోని ప్రధాన సంఘాలలో ఒక్క స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తప్ప మిగిలిన సంఘాలు విద్యుత్ బస్సుల సమస్యపై స్పందించకపోవడం విచారకరం. ఇప్పటికైనా ఏపీఎస్ఆర్టీసీ లోని సంఘాలు విద్యుత్ బస్సుల సమస్యపై స్పందించాలి.
ఛలో ఢిల్లీ కార్యక్రమంలో ఈ రాష్ట్ర రవాణా రంగ కార్మికులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు పాల్గొనాలని ఎస్డబ్ల్యుఎఫ్ పిలుపునిస్తున్నది. ఈ సమావేశంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎండి అంజిబాబు, కడప జోనల్ అధ్యక్షులు ఆర్ అజీమ్ ఖాన్, జిల్లా కార్యదర్శి వి ఎస్. రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️