దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత సావిత్రిబాయి పూలే

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : మహిళలపై జరిగే దురాచారాల నిర్మూలన కోసం పోరాడిన క్రాంతి జ్యోతి మాత సావిత్రిబాయి పూలే అని జిల్లా విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు తెలిపారు. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పీలేరులోని బాస్‌ ఆఫీసులో భారతీయ అంబేద్కర్‌ సేన జిల్లా కార్యవర్గ సభ్యులు ముల్లంగి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆమె వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అన్నమయ్య జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు బాస్‌ నాయకులతో కలిసి సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మనుస్మృతి అమలు చేసిన దుర్మార్గపు చట్టాలను మంటలకు ఆహుతి చేసిన క్రాంతి జ్యోతి, భారత మహిళా తొలి ఉపాధ్యాయిని పూలే అని కొనియాడారు. అంతేకాకుండా ఆమె బాల్య వివాహాలు, సతీసహగమనం, అంటరానితనం వంటి దురాచారాల నిర్మూలనకు విరోచిత పోరాటం సాగించారని, వితంతువుల పునర్వివాహానికై తన భర్త మహాత్మ జ్యోతిరావు పూలేతో కలిసి పోరాడారని గుర్తు చేశారు. 1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ఏర్పాటుచేసి, ఆ పాఠశాలకు భారతదేశంలోనే తొలి ఉపాధ్యాయురాలుగా పని చేశారని అన్నారు. అదేవిధంగా జ్యోతిరావు పూలే- సావిత్రిబాయి పూలే దంపతులు శూద్రుల కోసం, మహిళల కోసం అనేక పాఠశాలలు స్థాపించి బహుజన వర్గాల్లో వెలుగులు నింపి వారి అభివఅద్ధికి తోడ్పాటు అందించారన్నారు. రైతులు, కార్మికుల మహిళా హక్కుల కోసం అన్ని రంగాల్లో సమానత్వం కోసం సమరం చేసిన క్రాంతి జ్యోతి మాతా సావిత్రిబాయి పూలే అని తెలియజేశారు. సమాజసేవలో తరించిన ఆమె ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ, ఆమె కూడా ఆ వ్యాధి సోకి తుదిశ్వాస విడిచారని చెప్పారు. సావిత్రిబాయి పూలే జీవిత పోరాటాలు, త్యాగాలను నేటి సమాజానికి తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్‌ సేన నాయకులు ముల్లంగి కృష్ణయ్య, పల్లిపోగు హరినాధ, ముల్లంగి గురవయ్య, హరీష్‌, కిషోర్‌, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️