ఎస్సీ కులగణన తప్పులు తడక

Jan 10,2025 13:43 #SC caste census mistakes

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : రాష్ట్రంలో ఎస్సీ కులం మార్చే కుట్ర జరుగుతుందని ఎస్సీ కులగణన అంతా తప్పుడు తడకలుగా మారిందని దళిత నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం, ఆచంట పెద్ద పేట, చిన్న పేటకు చెందిన ఎస్సీ మాల కులాలకు చెందిన నేతలు స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్‌ ఎం సోమేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ కులగణన పేరుతో ఆర్యన్‌ మాల, ఆర్యన్‌ మాల క్రిస్టియన్‌, ఆదిఆంధ్ర, ఆది ఆంధ్ర క్రిస్టియన్‌, ఎస్సీ మాల క్రిస్టియన్‌హొ గా తప్పుడు సమాచారాన్ని ముద్రిస్తున్నారని ఆందోళన వ్యక్తం  చేశారు. గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ మాల కులానికి చెందిన పర్మినెంట్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. ఇటీవలే జరిపిన కులగణన ఆచంట పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించిన జాబితా పై సమగ్ర సర్వే చేయించి తప్పులు సరిచేయాలని, డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్‌ సోమేశ్వర మాట్లాడుతూ వీఆర్వోలు చేస్తున్న కులగణన  సర్వే లో కొన్ని తప్పులు వచ్చాయని, వీటిని సరిచేసి గ్రామ సభలు నిర్వహించి అనంతరం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు కోట వెంకటేశ్వరరావు, పారుపల్లి సుందరపాల్‌, మట్టా చంటి, బీర మధు, ఇజ్రాయిల్‌, రామాంజనేయులు, శ్రీనివాస రావు, ప్రసాద్‌, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️