ప్రజాశక్తి పార్వతీపురం టౌన్ : స్కూల్ బస్సు బోల్తాపడిన సంఘటనలో బస్సు క్లీనర్ పెంకి మురళి (25) మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఒక ప్రైవేటు స్కూలు బస్సు విద్యార్థులను తీసుకొని పార్వతీపురం మండలం బాలగోడబకు వెళ్తుండగా, ఆ గ్రామం సమీపానున్న జోగి నాయుడు చెరువు మలుపు వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి పంట పొలాల వద్ద బోల్తా పడింది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తీశారు. అదే గ్రామానికి చెందిన బస్సు క్లీనర్ పెంకి మురళి (25) మతి చెందాడు., బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులకు చిన్నపాటి గాయాలయ్యాయి. మిగతా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలిసిన వెంటనే రూరల్ ఎస్‌ఐ సంతోష్ కుమారి ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ద్రువీకరించారు. ఇదిలా ఉండగా మురళి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఇంకా వివాహం కాలేదు. తమ చేతికి అందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరై రోధిస్తున్నారు. గ్రామంలో విషాఛాయలు అలముకున్నాయి.