ఆర్‌టిసి బస్సులూ మళ్లింపు
24వేల మంది తరలింపునకు సన్నాహాలు
ఆసక్తి చూపని ప్రజానీకం
నిరాకరించిన వారిపై రాజకీయ ఒత్తుళ్లు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవలేదట. చివరకు ఎలాంటి ఆర్డర్ లేకుండానే మనసులో అనుకున్నవన్నీ చకచకా జరిగిపోతాయట. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం చంద్రబాబు పాలన ఇందుకు అద్దం పడుతోంది. విశాఖపట్నంలోని ఎయు ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో బుధవారం జరగబోయే బహిరంగ సభకు మోడీ హాజరు కానున్న విషయం విధితమే. ఏర్పాట్ల కోసం అక్కడ రూ.కోట్లు ఖర్చుచేస్తున్నారు. తాజాగా మన జిల్లా అధికార యంత్రాంగం జన సమీకరణ, ప్రయాణ ఏర్పాట్లలో తలమునకలైంది. సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఆర్టీసి బస్సులను అధిక సంఖ్యలో మళ్లించడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించారు. అనేకసార్లు ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పటికీ మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్తున్నారు. ప్రధాని సభకు జిల్లా నుంచి 24వేల మంది జనాన్ని తరలించాలని అధికార యంత్రాంగానికి లక్ష్యం విధించారు. అనుగుణంగా ఆర్టీసి విజయనగరం డిపో నుంచి 70, ఎస్.కోట డిపో నుంచి 30చొప్పున మొత్తం 100బస్సులు, మరో 150 వరకు ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇవి కాకుండా చిన్నచితక కలుపుకుని జిల్లా వ్యాప్తంగా 425 వాహనాలు ఉంటాయని సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసి డిపోల నుంచి 80బస్సులను ప్రధాని సభకు వైపు మళ్లించారు. బస్సుల మళ్లింపు నేపథ్యంలో జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఈ సంగతి కాస్త అటుంచితే…. జనం తరలింపునకు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ లక్ష్యానికి అనుగుణంగా జనాన్ని తీసుకురావాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందట. మరోవైపు జిల్లాలోని మెజార్టీ గ్రామాల్లో వరిచేను నూర్పులు, ధాన్యం విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి చేను, ధాన్యం కూడా కల్లాల్లోనే ఉన్నాయి. వాతావరణం రోజుకోలా ఉంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికీ చాలా మంది రైతులు నష్టపోయారు. ఈనేపథ్యంలో రైతు కుటుంబాలవారు ప్రధాని సభకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఈరకమైన ఇబ్బందుల వల్ల కరుడుగట్టిన టిడిపి, జనసేన కార్యకర్తలు కూడా విశాఖ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పార్వతీపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో ఈ జిల్లాలోని అధికార యత్రాంగం, ప్రజాప్రతినిధులు, జనసేన, టిడిపి నాయకులు డ్వాక్రా మహిళలలపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఆయా జిల్లాలో డిఆర్‌డిఎ పీడీలకు జన సమీకరణకు ప్రధాన బాధ్యతలు అప్పగించారు. పాపం…! ఈ సంఘాల్లోనూ ఎక్కువమంది రైతు కుటుంబాలకు చెందినవారే అన్న విషయం గుర్తుకు రాలేదేమో. ఈ నేపథ్యంలో ముందుకు రాని రైతులు, డ్వాక్రా మహిళలపై కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి. ఈ సారికి మమ్మళ్లి వదిలేయండి అంటూకొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా, ససేమిరా వచ్చేదే లేదంటూ మరికొందరు నాయకులు, ప్రభుత్వ సిబ్బంది ముఖంపైనే చెప్పేస్తున్నారట. మరోవైపు పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వంపై విమర్శలు మొదలవుతాయని భావించిన ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించింది. ఇందుకనుగుణంగా డిఇఒ నుంచి ఎంఇఒలకు, ఎంఇఒల నుంచి ప్రధాన ఉపాధ్యాయులకు మంగళవారం సాయంత్రం మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ విధమైన ఆదేశాలనుసారం పాఠశాల యాజమాన్యాలు బుధవారం సెలవు అని చెప్పినప్పటికీ ఎందుకు? ఏమిటి? అనే విషయాలను విద్యార్థులకు చెప్పకపోవడం గమనార్హం.