కత్తెరింపు

జిల్లాల్లో కరువు..కత్తిరింపులకు గురైంది. కడప, అన్నమయ్య జిల్లాలోని 66 మండలాల పరిధిలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. 19 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. మిగిలిన 47 మండలాలను గాలికి వదిలేసింది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలు నుంచి వర్షపాతలేమి వేదింపులకు గురిచేస్తోంది. కరువు పరిస్థితులను అంచనా వేయడానికి సంబంధించిన ఐదారు పారా మీటర్ల ఆధారంగా కరువును గుర్తించడం పరిపాటి. 2024-25 ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం కరువు మండలాలను నోటిఫై చేసింది. కడప జిల్లాలోని 36 మండలాలు, అన్నమయ్య జిల్లాలో 30 మండలాలు వెరసి 66 మండలాల్లో 33 మండలాల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపించడం గమనార్హం. ఇందులో కడప జిల్లాలో 10 మండలాల్లో వర్షపాత లేమి కనిపించింది. అన్నమయ్య జిల్లాలో 23 మండలాల్లో వర్షపాత లేమి కారణంగా పంటలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. వర్షపాత లేమి, పంటల సాగు తగ్గుదల, ఎండుతున్న పంటలు, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనుల పెరుగుదల, పశువులు కబేళాలకు తరలింపు, పశుదాణా తదితర పారామీటర్లను దృష్టిలో ఉంచుకుని కరువు మండలాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో వర్షపాత లేమి, పంటల సాగు విస్తీర్ణం తగ్గుదల వంటి పలు పారామీటర్ల ఆధారంగా కడప జిల్లాలోని 36 మండలాల్లో సుమారు 10 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఇటువంటి క్షామ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లాలో కరువు మండలాలను గుర్తించాల్సి ఉంది. ప్రభుత్వం కడప జిల్లాలోని 36 మండలాల్లోని వర్షపాత లేమి, పంటల సాగు తగ్గిన ప్రాంతాలను కరువు మండలాల పరిధిలో చేర్చకపోవడం విస్మయాన్ని కలిగించింది. గతేడాది వైసిపి సర్కారు కడప జిల్లాలో నెలకొన్న క్షామ పరిస్థితులను గుర్తించి కరువు మండలాలను గుర్తించడంలో నిరాధరణకు గురిచేసింది. 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ఎన్డీయే సర్కారు అన్నమయ్య జిల్లాలో పంటలు సాగు తగ్గిన నాలుగు మండలాలను తగ్గించడం, కడప జిల్లాను పూర్తిగా నిరాదరణకు గురిచేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన రైతు సంఘాల నాయకులు కరువు మండలాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తున్నారు. కరువు మండలాల గుర్తింపు నేపథ్యంలో సంబంధిత మండలాల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుందో ఎవరికీ తెలియడం లేదు. సాధారణంగా కరువు పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో రుణాలు రీషెడ్యూల్‌ చేయడం, ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ చెల్లింపుల్లో మినహాయింపు ఇవ్వడం, ఇన్సూరెన్స్‌ విడుదల చేయడం మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకోవడం తెలిసిందే. తాజా కరువు మండలాల గుర్తింపు నేపథ్యంలో ప్రభుత్వం బాధిత రైతులకు ఎటువంటి మినహాయింపులు వర్తింపజేయనుందో వేచిచూడాలి.- ప్రజాశక్తి- కడప ప్రతినిధి

➡️