స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలు విస్తరించాలి

Nov 7,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరంకోట : గొప్ప సేవా దృక్పథంతో జాతికి విశేష సేవలను అందిస్తున్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలను మరింత విస్తరించాలని జిల్లా కలెక్టర్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా ఛైర్మన్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ 75 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈవేడుకలకు జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరై, విశేష ప్రతిభ చూపిన 10మంది స్కౌట్స్‌, గైడ్స్‌కు రాజ్యపురస్కార్‌ సర్టిఫికేట్లను బహూకరించి, వారిని అభినందించారు. స్కౌట్స్‌ ప్రదర్శించిన విన్యాసాన్ని తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్కౌట్స్‌ మరియు గైడ్స్‌ సేవలను కొనియాడారు. సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న ఈ సంస్థకు అత్యంత ప్రాముఖ్యత ఉందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతి విద్యార్ధులను ఈ ఉద్యమంలోకి తీసుకురావాలని సూచించారు. దశలవారీగా ప్రయివేటు పాఠశాలలకు కూడా విస్తరిస్తామని ప్రకటించారు. జిల్లా విద్యాశాఖాధికారి, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఛీఫ్‌ కమిషనర్‌ మాణిక్యం నాయుడు మాట్లాడుతూ, విద్యార్ధుల్లో చిన్ననాటినుంచే దేశభక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. మంచి పౌరులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ఈ కార్యక్రమం మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి వి.చిన్నంనాయుడు మాట్లాడుతూ, ఈ ఉద్యమ చరిత్రను వివరించారు. 1907లో కేవలం 20 మందితో ప్రారంభమైన ఈ ఉద్యమం, తరువాత కాలంలో 174 దేశాలకు విస్తరించిందని తెలిపారు. 1950 నవంబరు 7నుంచి దేశంలోని వివిధ సంస్థలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఏర్పాటయ్యిందని చెప్పారు. జిల్లాలో కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయని, కొత్తవలస జెడ్‌పి ఉన్నతపాఠశాల విద్యార్ధి ఆర్‌డి సోమేశ్వర్రావు రాజ్యపురస్కార్‌కు ఎంపికై, గవర్నర్‌ చేతులమీదుగా అందుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిసి బోర్డు కార్యదర్శి సన్యాశిరాజు, జిల్లా స్కౌట్స్‌ కమిషనర్‌ ఈపు విజయకుమార్‌, గైడ్స్‌ కమిషనర్‌ సౌభాగ్యలక్ష్మి, ఇతర ప్రతినిధులు, హెడ్‌మాష్టర్లు, విద్యార్ధులు పాల్గొన్నారు.

➡️