స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ ప్రారంభం

ప్రజాశక్తి-పుల్లలచెరువు : మండల కేంద్రమైన పుల్లలచెరువులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ పాఠశాల పిఎం శ్రీ కింద నమోదు కావడంతో క్రమశిక్షణ, సామాజిక సేవలను పెంపొందించేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ కొలుకులూరి క్రిష్టయ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవ, సామాజిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవ్వాలని తెలిపారు. మంచి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పుల్లలచెరువు పాఠశాలలో ఈ యూనిట్‌ను ప్రారంభించడం హర్షణీయమన్నారు. విద్యార్థులు సామాజిక అంశాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అప్పుడే విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించగలుగుతారని సూచించారు. స్కౌట్స్‌ విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎంఈఓ-2 ఇందిరా ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంచాలన్నారు. అనంతరం విద్యార్థులు దీక్ష, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్‌టిలు శివనాగిరెడ్డి, వెంకటరెడ్డి, స్కౌట్‌ మాస్టర్‌ వెంకట కోటయ్య, గైడ్‌ కెప్టెన్‌ కెవిఎల్‌ఎమ్‌ లత, సీనియర్‌ స్కౌట్‌ మాస్టర్‌ వెంకటేశ్వర్లుతో పాటు పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️